బాధేస్తే తనకే కాల్ చేస్తా.. తన నుంచే స్ఫూర్తి పొందుతుంటా: తమన్నా

Update: 2021-06-08 03:30 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోల సంగతేమో కానీ హీరోయిన్స్ మధ్య మాత్రం కచ్చితంగా ఈగోలు మనస్పర్థలు ఉంటాయని అంటుంటారు. దీనికి కారణాలు ఏవైనా, వృత్తి పరంగా కాకుండా వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండే హీరోయిన్లు చాలా తక్కువ. ఎవరో ఒకరిద్దరు తప్పితే నటీమణులలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా - శ్రుతి హాస‌న్ ఉన్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరిద్దరూ చాలా ఏళ్లుగా సన్నిహితులుగా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తమ మధ్య అనుబంధం గురించి.. ఫ్రెండ్ షిప్ గురించి చెబుతూ ఉంటారు. తాజాగా త‌మ‌న్నా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రుతితో ఉన్న స్నేహం గురించి వివరించారు.

తమన్నా మాట్లాడుతూ.. ఎప్పుడు బాధ‌గా అనిపించినా శ్రుతి హాసన్ కు కాల్ చేస్తానని.. తను ఎప్పుడూ అంత ఉత్సాహంగా ఎలా ఉండ‌గ‌లుగుతుందో తెలుసుకుంటూ ఉంటానని చెప్పింది. శృతి త‌న ఇంటిని పూర్తిగా తనే చూసుకుంటుందని.. చ‌క్క‌గా తీర్చిదిద్దుకుంటుందని.. ఒంట‌రిగా ఉంటూ క‌ష్ట‌ప‌డి కెరీర్‌ ను కొన‌సాగిస్తుంటుందని మిల్కీ బ్యూటీ తెలిపింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే శృతి.. త‌న అభిమానుల‌తో టచ్ లో ఉంటుందని.. చాలా హుషారుగా మాట్లాడుతుందని చెప్పింది. శృతి మాదిరిగా ఎప్పుడూ స‌ర‌దాగా ఉండ‌టం అంత ఈజీ కాదని.. త‌న‌లా ఉండ‌టం చాలా క‌ష్టమని.. అందుకే త‌న నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతానని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.

కాగా, '11త్ అవర్' 'నవంబర్ స్టోరీస్' వెబ్ సిరీస్ లతో ఓటీటీ రంగంలో అడుగుపెట్టిన తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 'సీటీమార్' 'గుర్తుందా శీతాకాలం' 'ఎఫ్ 3' సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే తమన్నా 'అంధాదున్' తెలుగు రీమేక్ లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. మరోవైపు శ్రుతి హసన్ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టి 'క్రాక్' 'వకీల్ సాబ్' వంటి రెండు వరుస హిట్స్ అందుకుంది.
Tags:    

Similar News