కోలీవుడ్ మార్కెట్.. బన్నీ బిగ్ టార్గెట్ సొంతమవుతుందా?
కానీ అదే స్థాయిలో తెలుగు హీరోలు కోలీవుడ్ మార్కెట్ ను శాసించిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లోటును పూరించాలనే ప్రయత్నంలోనే అల్లు అర్జున్ ఉన్నారని అర్థమవుతుంది.;
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో బిగ్ టార్గెట్ తో ముందుకెళ్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. నిజానికి ఇప్పటి వరకు అనేక మంది తమిళ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. కానీ అదే స్థాయిలో తెలుగు హీరోలు కోలీవుడ్ మార్కెట్ ను శాసించిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లోటును పూరించాలనే ప్రయత్నంలోనే అల్లు అర్జున్ ఉన్నారని అర్థమవుతుంది.
అయితే పుష్ప సిరీస్ చిత్రాలతో అల్లు అర్జున్ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఓ రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతే కాదు.. తమిళంలో కూడా ముఖ్యంగా పుష్ప 2: ది రూల్ మూవీ భారీ వసూళ్లు సాధించింది. దీంతో తమిళ మార్కెట్ లో తనకు అవకాశాలు ఉన్నాయని బన్నీకి స్పష్టత వచ్చిందేమో. ఇప్పుడు అదే ఊపుతో తమిళ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్.
ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తమిళనాడులో ఆ మూవీని రికార్డు స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అట్లీకి తమిళంలో ఉన్న క్రేజ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కలిసి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్ బన్నీకి తమిళ మార్కెట్ లో కీలక బ్రేక్ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
అట్లీ సినిమా తర్వాత వెంటనే అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయనున్నారు. AA 23 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఆ చిత్రం పాన్ ఇండియా సూపర్ హీరో మాస్ ఎంటర్టైనర్ గా రెడీ అవ్వనుందని టాక్. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కానీ లోకేశ్ తాజా సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో కాస్త ఆయనపై నెగిటివ్ టాక్ ఉంది.
అలాంటి పరిస్థితుల్లో కూడా లోకేష్ కనగరాజ్ పై అల్లు అర్జున్ నమ్మకం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే పుష్ప 2 భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది. ముఖ్యంగా హిందీ బెల్ట్స్ లో ఆయన క్రేజ్ ఊహించని స్థాయికి చేరింది. ఇప్పుడు అదే స్థాయిలో తమిళనాడులో కూడా పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆ సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏజ్, ఎనర్జీ, డ్యాన్స్, మాస్ అప్పీల్ ఇవన్నీ తమిళ సినీ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే అంశాలే. ఇతర తెలుగు హీరోలతో పోలిస్తే తమిళ మార్కెట్ సొంతం చేసుకునే అవకాశాలు బన్నీకే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో పలువురు ప్రయత్నించినా, అక్కడ పూర్తిస్థాయిగా సక్సెస్ అవ్వలేకపోయారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుంటున్న రిస్క్ పెద్దదే అయినా, ఫలితం వస్తే మాత్రం చరిత్రే మారనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.