స్టార్ హీరో కాంగ్రెస్ వ్యతిరేక ప్రొపగండా?
శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి' ఈ సంక్రాంతి బరిలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రకరకాల వివాదాల కారణంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.;
శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి' ఈ సంక్రాంతి బరిలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రకరకాల వివాదాల కారణంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ సినిమాపై ప్రస్తుతం తమిళనాడుతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున `ప్రొపగండా` వివాదం నడుస్తోంది. 1952లో శివాజీ గణేషన్ నటించిన క్లాసిక్ సినిమా 'పరాశక్తి' పేరును ఈ చిత్రానికి పెట్టడం, టీజర్, ట్రైలర్‌లోని కొన్ని అంశాలు ఈ వివాదానికి కారణమయ్యాయి. పూర్తి నెగెటివ్ రివ్యూలు వచ్చినా పండగ సెలవులు కలిసొచ్చి ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది.
ఈ సినిమా చుట్టూ ఉన్న ప్రధాన వివాదాస్పద అంశాలను పరిశీలిస్తే.. 1952లో వచ్చిన 'పరాశక్తి' సినిమా ద్రవిడ ఉద్యమ భావజాలంతో, హిందూ మతంలోని కొన్ని ఆచారాలను విమర్శిస్తూ సాగింది. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమాకు అదే పేరు పెట్టడం వెనుక మళ్ళీ హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేసే అండర్ కరెంట్ ఉద్దేశం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే పాత సినిమాలో `దేవాలయం దోపిడీకి నిలయం కాకూడదు' అనే సందేశం ఇమిడి ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో ఆధునిక దేవాలయాల నిర్వహణపై విమర్శలు ఎక్కుపెట్టారని కొందరు వాదిస్తున్నారు.
ఈ సినిమాను నిర్మిస్తున్న బ్యానర్ల(నిర్మాతల)కు, అలాగే దర్శకుడికి కొన్ని రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల ఇది రాబోయే ఎన్నికల కోసం ఒక ప్రత్యేక `ప్రొపగండా` ఫిలింగా రూపొందిందని విమర్శలు వస్తున్నాయి.
సినిమాలో సామాజిక న్యాయం పేరుతో ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా మతపరమైన సంస్థలను టార్గెట్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
టీజర్ , పోస్టర్ దశ నుంచే వివాదాలు రగులుకున్నాయి. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలలో శివకార్తికేయన్ ఒక సామాన్యుడిగా కనిపిస్తూనే, వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడే డైలాగులు ఉన్నాయి. ప్రభుత్వం, మతపరమైన విశ్వాసాల మధ్య ఘర్షణను ఈ సినిమా హైలైట్ చేస్తోందని, ఇది సమాజంలో విభజనను తెస్తుందని కొందరు `సెన్సార్ బోర్డు`కు కూడా ఫిర్యాదు చేశారు.
కథానాయకుడి వివరణ:
అయితే ఈరోజుల్లో వివాదాలు సహజం. ఈ వివాదాలపై శివకార్తికేయన్ స్పందిస్తూ-``ఈ సినిమా ఏ మతానికి లేదా వర్గానికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం మానవత్వం, సామాజిక మార్పు గురించి మాట్లాడే సినిమా. పాత పరాశక్తి సినిమా ఒక మైలురాయి, దానికి గౌరవంగానే ఈ పేరు పెట్టాం`` అని స్పష్టం చేశారు.
అయితే పరిశ్రమ స్పందన శివకార్తికేయన్ కి అనుకూలంగా ఉంది. చాలామంది సినీ విశ్లేషకులు దీనిని కేవలం ఒక `క్రియేటివ్ ఫ్రీడమ్`గా చూస్తున్నారు. అయితే సెన్సిటివ్ సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు వివాదాలు రావడం సహజమని సినిమా రిలీజ్ ముందు పలువురు వ్యాఖ్యానించారు.
పూర్తి వివాదం డీటెయిల్స్ లోకి వెళితే..
పలుమార్లు సెన్సార్ అడ్డంకులు, వివాదాల మధ్య, ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతి (పొంగల్) కానుకగా వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన లభించింది. అసలు వివాదం ఏమిటి? అంటే.. ఈ సినిమా 1960వ దశకంలో తమిళనాడులో జరిగిన `హిందీ వ్యతిరేక ఉద్యమం` నేపథ్యం హైలైట్ చేయడమే.. దీనిపై ప్రధానంగా తమిళనాడు యూత్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
చరిత్రను వక్రీకరించారని నాయకులు ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తక్కువ చేసి చూపించారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని ఆరోపించారు.
శివకార్తికేయన్ పాత్ర ఇందిరా గాంధీని కలవడం, ఆమె సమక్షంలోనే రైలుకు నిప్పు పెట్టడం వంటి సీన్లు కేవలం కల్పితమని, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయడానికే వీటిని చిత్రీకరించారని పలువురు వాదిస్తున్నారు. తమిళ వ్యతిరేకిగా కాంగ్రెస్ పార్టీని చిత్రీకరించారని కూడా ఆరోపించారు.
దీంతో ఈ సినిమాను వెంటనే నిషేధించాలని, వివాదాస్పద సన్నివేశాలను తొలగించి చిత్ర బృందం క్షమాపణలు చెప్పాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో థియేటర్ల వద్ద నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న డీఎంకే- కాంగ్రెస్ మధ్య ఈ సినిమా చిచ్చు పెట్టింది. డీఎంకే అనుకూల భావజాలాన్ని ప్రచారం చేస్తూ, కాంగ్రెస్‌ను విలన్లుగా చూపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ ఈ సినిమాను ప్రశంసిస్తూ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు లేఖ రాశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా ఒక బలమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమాను సెన్సార్ బోర్డు క్షుణ్ణంగా పరిశీలించి 25 కట్స్ చెప్పింది. కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు మార్పులను సూచించింది. వివాదాస్పద సన్నివేశాలకు ముందు `ఇది కల్పితం` అనే డిస్‌క్లైమర్స్ వేయాలని ఆదేశించింది. చివరకు యుఏ సర్టిఫికేట్‌తో సినిమా విడుదలైంది. తాజా వివాదాలపై స్పందిస్తూ .. కాంగ్రెస్ వ్యతిరేక ప్రొపగండా చేయలేదని, ఉన్నది ఉన్నట్టు సినిమాను తీసామని శివకార్తికేయన్ వివరణ ఇచ్చారు.