తాజ్-డివైడెడ్ బై బ్లడ్ ట్రైలర్: స‌లీమ్- అనార్క‌లి ప్రేమ‌క‌థ‌లో ర‌క్త‌చ‌రిత్ర‌

Update: 2023-02-19 12:46 GMT
రామాయ‌ణంలో శ్రీ‌రాముడు అడ‌వుల పాల‌వ్వ‌డానికి కార‌ణం సీత‌!  మొఘ‌లుల సామ్రాజ్యంలో ర‌క్త‌చ‌రిత్ర‌కు కార‌ణం అనార్క‌లి. చ‌రిత్ర‌లో ఒక ఆడ‌దాని వ‌ల‌న ఘోర‌మైన యుద్ధాలు జ‌రిగాయి. అటు గ్రీకుల క‌థ‌లోను ట్రాయ్ వార్ వెన‌క ఒక స్త్రీ అప‌హ‌ర‌ణ కార‌ణ‌మ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఇవ‌న్నీ సినిమాలుగా తెర‌కెక్కాయి. బుల్లితెర‌కెక్కాయి. ఇప్పుడు ఓటీటీల్లోను అల‌రించ‌నున్నాయి.

తాజాగా మొఘ‌ల్ సామ్రాజ్య ప‌త‌నం - దాని ర‌క్త చ‌రిత్ర వెన‌క ఒక శృంగార ర‌స ప్రేమ‌క‌థ దాగి ఉంద‌న్న న‌గ్న‌స‌త్యాన్ని ఆవిష్క‌రిస్తూ ఓటీటీ- జీ5లో స‌రికొత్త‌ సిరీస్ రంజింప‌జేసేందుకు వ‌స్తోంది.తాజ్-డివైడెడ్ బై బ్లడ్ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రైల‌ర్ తాజాగా విడుద‌లై వెబ్ లో దూసుకెళుతోంది. ఇందులో నసీరుద్దీన్ షా అక్బర్ గా నటించారు. రారాజు తనకు తగిన వారసుడిని వెతికే క్ర‌మంలో అనార్క‌లి (అదితి రావ్ హైదరీ) ప్ర‌వేశంతో అస‌లు క‌థ అంతా మారిపోతుంది.

అనార్కలి రాక సలీమ్ తో ప్రేమాయ‌ణం శృంగారం చ‌క్ర‌వ‌ర్తి అయిన‌ అక్బ‌ర్ ప్రణాళికలను విఫలమ‌య్యేలా చేశాక ఆ కోట‌లో ఏం జ‌రిగింద‌నేది మిగ‌తా క‌థ‌. ధర్మేంద్ర- అదితి రావ్ హైదరీ- ఆషిమ్ గులాటీ- తాహా షా -శుభమ్ కుమార్ మెహ్రా త‌దిత‌రులు నటించిన ఈ అమోఘ‌మైన‌ చారిత్రాత్మక డ్రామా మార్చి 3న విడుదల కానుంది.

Zee5 - తాజ్-డివైడెడ్ బై బ్లడ్ అనేది మొఘల్ ల చ‌రిత్ర‌కు న‌వ్య పంథా రీటెల్లింగ్ అని చెప్పాలి. ఈ క‌థ ఆద్యంతం రొమాన్స్ కుయుక్తులు కుట్ర‌ల‌ స్కాండల్ తో నిండి ఉంది. అస‌లు క‌థ‌లోకి వెళితే.. అక్బర్ (నసీరుద్దీన్ షా) అతని సామ్రాజ్యానికి స‌రైన వారసుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. తాజ్ - డివైడెడ్ బై బ్లడ్ ట్రైలర్ లో మొదటి కొడుకుకు సింహాసనం గ్యారెంటీ కాదని అక్బర్ ప్రకటించాడు. బదులుగా అక్బర్ తన ముగ్గురు కొడుకులకు వారసుడిని ఎన్నుకునే సమయం వచ్చినప్పుడు ఎవ‌రి యోగ్యత అర్హ‌త ఎంతో చూస్తానని చెబుతాడు. ఆ ముగ్గురూ ఒక‌రికొక‌రు విభిన్నం.

యువరాజు సలీం (ఆషిమ్ గులాటి) చక్రవర్తి కవచం రాజ్యాధికారం కంటే కళలు రాజరిక జీవనశైలిపై ఆసక్తిని కలిగి ఉంటాడు. అయితే ప్రిన్స్ మురాద్ (తాహా షా) సింహాసనం తనకు మాత్రమే చెందుతుందని నమ్ముతాడు. ప్రిన్స్ డానియాల్ (శుభమ్ కుమార్ మెహ్రా) ఆ ఇద్ద‌రిలా కాకుండా స్వచ్ఛమైన వ్య‌క్తిత్వంతో దురాశ లేని రాకుమారుడిగా క‌నిపిస్తాడు.

అక్బర్ సలహాదారు అతని కుమారుల మధ్య అశాంతి గురించి రారాజును హెచ్చరించ‌డం ట్రైల‌ర్ లో క‌నిపిస్తుంది. ఈ ట్రైల‌ర్ ప్ర‌కారం.. అదితి రావ్ హైదరీ అనార్కలి రాకతో వారసత్వ పోరు మరింత ఊపందుకుంటుంది. అనార్క‌లి సలీం దగ్గరవుతారు. స‌మ్మోహ‌నంలో మునిగి తేల‌తారు. వారి శృంగార ర‌స సామ్రాజ్యం ఎంతో ప్ర‌త్యేకంగా తెర‌పై అల‌రిస్తుంది. కానీ ఇది చ‌క్ర‌వ‌ర్తి అక్బర్ కి న‌చ్చ‌దు. అనార్క‌లి ని త‌న‌ స్థానంలో తాను ఉండమని అనార్కలిని బెదిరిస్తాడు. రాకుమారుడికి అనార్కలి త‌గిన యోగ్యురాలు కాద‌నేది అత‌డి ఉద్ధేశం. బాద్షా బన్నా కిస్కే నసీబ్ మే హో-ఉస్సే అప్నీ ఖుషియాన్ కుర్బాన్ కర్నీ హీ పడ్తీ హై.. ఎవరైతే రాజు అవుతారో వారు దానిని సాధించడానికి తమ ఆనందాన్ని త్యాగం చేయాలి! అని అక్బర్ వారందరినీ హెచ్చరించాడు.

అసాధార‌ణ‌మైన అత్యంత‌ భారీ మొఘ‌లుల కోట‌లో జరుగుతున్న వ్యక్తిగత వ్యవహారాలు అంతర్గత కుతంత్రాలతో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ కథనంలో అనేక కుంభకోణాలు ఉంటాయని ట్రైలర్ వెలుగులోకి తెచ్చింది. రాకుమారులు..  రాజు కావడానికి అయ్యే ప్ర‌య‌త్నాల‌తో పాటు వారి వ్యక్తిగత వ్య‌వ‌హారాల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అధికారం కోసం అన్వేషణను వివరించే గ్రాండ్ పీరియడ్ డ్రామా ఇది. ఇందులో క్వీన్ జోధా బాయిగా సంధ్యా మృధుల్- క్వీన్ సలీమాగా జరీనా వహాబ్- మెహర్ ఉన్ నిసాగా సౌరసేని మైత్రా- మీర్జా హకీమ్ గా రాహుల్ బోస్ - షేక్ సలీం క్రిస్టీగా ధర్మేంద్ర న‌టించారు. తాజ్ తారాగణంలో సుబోధ్ భావే- ఆయం మెహతా- దీప్‌రాజ్ రాణా- శివాని టంక్ సలే- పద్మా దామోధరన్- పంకజ్ సరస్వత్-దిగంబర్ ప్రసాద్ - జాచరీ కాఫిన్ త‌దిత‌రులు ఉన్నారు. కాంటిలో డిజిటల్ నిర్మించిన‌ తాజ్-డివైడెడ్ బై బ్లడ్ కి సైమన్ ఫాంటౌజో రచయిత కాగా.. రోనాల్డ్ స్కాల్పెల్లో దర్శక‌త్వం వ‌హిచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Similar News