సామాజిక సేవ‌లో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ త‌గ్గేదేలే! జిల్లా క‌మిటీల బ‌లోపేతం!!

స్టార్ హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరో సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద సందడి చేయడం.. కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం చూస్తుంటాం.;

Update: 2026-03-09 14:41 GMT

స్టార్ హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరో సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద సందడి చేయడం.. కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం చూస్తుంటాం. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి సామాజిక బాధ్యతలో `తగ్గేదేలే` అంటున్నారు. అల్లు అర్జున్ ఇచ్చిన `వ‌న్ గుడ్ డీడ్ ఎవ్వెరి ఇయ‌ర్` (ప్ర‌తియేటా ఒక మంచి ప‌ని) అనే పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న అభిమానులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమాలను మరింత క్రమబద్ధంగా, విస్తృతంగా నిర్వహించేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా తాజాగా కరీంనగర్‌లో భారీ ఎత్తున ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. అభిమానులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి.. సేవా కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేర్చాలనే పట్టుదలతో సభ్యులు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో AAFA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ నేతృత్వంలో ఐదు జిల్లాలకు నూతన కమిటీలను ప్రకటించారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థాగతంగా ఫ్యాన్స్ అసోసియేషన్ మరింత బలోపేతమైంది. ఈ కమిటీలు తమ పరిధిలోని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, పేదలకు ఆహార వితరణ, విద్యార్థులకు సాయం వంటి కార్యక్రమాలను సమన్వయం చేయనున్నాయి. రాష్ట్ర నాయకత్వం అందించే మార్గదర్శకత్వంలో ఐకాన్ స్టార్ పేరును సామాజిక సేవలో అగ్రస్థానంలో నిలపాలని అభిమానులు సంకల్పించారు.

అల్లు అర్జున్ - అట్లీ మూవీ

ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్ క్రేజ్ ఉన్న దర్శకుడు అట్లీతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ కోసం హార్డ్ వ‌ర్క్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ నేప‌థ్యంలోని క‌థాంశాన్ని ఎంచుకున్నా .. అట్లీ మార్కు మాస్ ఎలిమెంట్స్ .. అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ మేళవింపుతో ఈ చిత్రం హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోందని.. ఇందుకోసం భారీ సెట్స్ వేసినట్లు సమాచారం.

ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని వచ్చే ఏడాది భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కడా బ్రేక్ లేకుండా పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. అట్లీ గత చిత్రం `జవాన్` బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం దృష్ట్యా అల్లు అర్జున్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

Tags:    

Similar News