మొద‌టి సినిమా టైమ్‌లో తెలుగు రాదు… కానీ ఇప్పుడేమో!

టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన సంయుక్త మీన‌న్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-03-09 11:30 GMT

టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన సంయుక్త మీన‌న్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా ఆమె నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకోవడంతో ఇండస్ట్రీలో ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సంయుక్త‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆమె తెలుగులో మాట్లాడిన తీరు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాల్లో తన క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్త‌, నిజ జీవితంలో కూడా అంతే సరదాగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగినట్టుగా ఆ పోడ్‌కాస్ట్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ముఖ్యంగా ఆమె తెలుగులో మాట్లాడే విధానం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే తెలుగు నేర్చుకున్న సంయుక్త‌, త‌న మొద‌టి సినిమా టైమ్ లో త‌న‌కు తెలుగు రాద‌ని నిజాయితీగా ఒప్పుకున్నారు.

కానీ సెకండ్ మూవీ విరూపాక్ష టైమ్ లో తాను తెలుగు నేర్చుకున్నాన‌ని, త‌న‌కు తెలుగుని చాలా ఈజీగా నేర్పించేవాళ్లు ట్యూట‌ర్లుగా ఉన్నార‌ని, వారి వ‌ల్లే తాను చాలా త్వ‌ర‌గా తెలుగు నేర్చుకోగ‌లిగాన‌ని, మ‌నం ఏదైనా భాష‌లో మాట్లాడితే దానికి సంబంధించి ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంద‌ని, త‌న మాతృభాష మాట్లాడేట‌ప్పుడు త‌న బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుగు మాట్లాడేట‌ప్పుడు కూడా త‌న బాడీ లాంగ్వేజ్ దాదాపు ఒకేలా ఉంటుంద‌ని ఆమె ఈ సంద‌ర్భంగా తెలిపారు.

కాగా ఆ పాడ్‌కాస్ట్‌లో సంయుక్త తెలుగులో మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సంయుక్త తెలుగు నేర్చుకున్న‌ప్ప‌టికీ, ఇప్పుడు కూడా తెలుగును కొంత ఇంగ్లీష్‌తో మిక్స్ చేస్తూ మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఆమె మాట్లాడే మాట‌లు కొంచెం బ్రోకెన్‌గా ఉన్నా, తెలుగులో మాట్లాడాల‌ని అమ్మ‌డు చేస్తున్న మాత్రం అభిమానులకు చాలా క్యూట్‌గా అనిపిస్తోంది. వాస్త‌వానికి ఇలా ఎవ‌రైనా స‌గం స‌గం తెలుగు మాట్లాడే సందర్భాల్లో సాధారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా కనిపించినా, సంయుక్త విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆమె మాట్లాడే తీరు సహజంగా ఉండటమే కాకుండా, భాషను నేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తెలుగు మాట్లాడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం చాలా జెన్యూన్‌గా ఉందని, హీరోయిన్ అయినా ఇంత సింపుల్‌గా మాట్లాడటం చాలా బాగుందంటూ పలువురు అభిమానులు ఆ వీడియోల‌కు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సంయుక్త కెరీర్ విష‌యానికొస్తే ఆమె ఇప్పటికే టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి స్థానం సంపాదించుకుంది. సంయుక్త నటించిన బింబిసార‌, సార్, విరూపాక్ష లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. సంయుక్త చేసిన సినిమాల్లో అఖండ‌2 త‌ప్ప మిగిలిన అన్నీ సినిమాలూ క‌మ‌ర్షియ‌ల్ గా కూడా వ‌ర్కౌట్ అయిన‌వే. రీసెంట్ గా శ‌ర్వానంద్ తో నారీ నారీ న‌డుమ మురారి సినిమాతో కూడా సంయుక్త మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం త‌న చేతిలో మ‌రికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులుండటంతో టాలీవుడ్‌లో ఆమెకు ఉన్న డిమాండ్ తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు సినిమాలతో విజయాలు సాధిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో తన సహజ స్వభావంతో అభిమానులను ఆకట్టుకుంటూ సంయుక్త మీనన్ ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలుస్తోంది. ఆమె మాట్లాడే క్యూట్ తెలుగు నుంచి, అభిమానులతో కలిసిపోవాలనే ప్రయత్నం వరకు అన్నీ కలిపి ఆమెకు మరింత అభిమానాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Tags:    

Similar News