సగం కంటే తగ్గిపోయిన సూర్య మార్కెట్

Update: 2019-05-19 11:16 GMT
తమిళ హీరోలలో చాలా తక్కువమందికి తెలుగు మార్కెట్ ఉంది.  అలాంటివారికి సూర్య ఒకరు.  'గజనీ' సినిమాతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించి మార్కెట్ సాధించుకున్న సూర్య ఆ సినిమా తర్వాత ప్రతి ఒక్క సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చాడు.  మొదట్లో సూర్య సినిమాలకు క్రేజ్ బాగానే ఉండేది కానీ గత కొంతకాలంగా మాత్రం సూర్య మార్కెట్ దారుణంగా తగ్గిపోయింది.

సూర్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన '24' సినిమా థియేట్రికల్ రైట్స్ ను  తెలుగులో రూ. 22 కోట్లకు అమ్మడం జరిగింది. అదే ఇప్పుడు సూర్య లేటెస్ట్ ఫిలిం 'ఎన్ జీ కే' రైట్స్ 9 కోట్లకు రాధామోహన్ దక్కించుకున్నారు.   ఈ సినిమాను  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తారు.  సూర్య మార్కెట్ ప్రకారం చూస్తే ఇది చాలా తక్కువ.  సూర్య సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తూ ఉండడంతో భారీ రేట్లు పెట్టి తెలుగు వెర్షన్ హక్కులను దక్కించుకునేందుకు ఎవరూ పోటీ పడడం లేదు.

సూర్య గత మూడు సినిమాలు చూస్తే రైట్స్ కు డిమాండ్ ఎలా తగ్గుతుందో మనం గమనించవచ్చు.  '24' సినిమా రైట్స్ 22 కోట్లకు  అమ్ముడుపోగా.. ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన  'యముడు 3' రైట్స్ రూ. 18 కోట్లు డీల్ కుదిరింది. ఈ సినిమా తర్వాత సూర్య నటించిన చిత్రం 'గ్యాంగ్' .  ఈ సినిమా హక్కులకు 15 కోట్ల ధర పలికింది.  ఇక ఈ ధర కాస్తా సూర్య కొత్త సినిమా 'NGK' దగ్గరకు వచ్చేసరికి మరింతగా తగ్గి రూ. 9 కోట్లకు ఫిక్స్ అయింది.

దాదాపు పాతిక కోట్ల వరకూ మార్కెట్ ఉన్న సూర్య మార్కెట్ ఇప్పుడు పదికోట్ల లోపుకు రావడం నిజంగానే  షాకింగ్ అంశం. సూర్య సినిమాలలో కొత్తదనం లోపించడం..  తమిళ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలకు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కడంలేదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే  సూర్య సినిమాల మార్కెట్ మరింతగా తగ్గుతుందనడంలో సందేహం లేదు.  దీనికి విరుగుడుగా సూర్య ముందున్న ఒకే మార్గం ఈ సినిమాతో ఒక సూపర్ హిట్ సాధించడం!


    

Tags:    

Similar News