సునీల్.. ఇంకేం దొరకలేదా?

Update: 2016-09-04 11:30 GMT
అసలే స్ట్రగుల్లో ఉన్నాడు సునీల్. హిట్టు కొట్టి చాలా కాలమైపోయింది. పైగా రొటీన్ సినిమాలు చేస్తున్నాడని.. తనకు నప్పని మాస్ వేషాలు వేసి ఇబ్బంది పెడుతున్నాడని విమర్శలున్నాయి అతడి మీద. అయినా సునీల్ లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. అవే సినిమాలు చేస్తున్నాడు. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వీరూ పోట్ల దర్శకత్వంలో చేసిన ‘ఈడు గోల్డ్ ఎహే’ కూడా ఏం భిన్నమైన సినిమాలాగా అనిపించట్లేదు. ఐతే ఈ సినిమా సునీల్ కెరీర్ కు చాలా కీలకం. ఇది ఆడకపోతే హీరోగా సునీల్ ప్రస్థానమే ప్రశ్నార్థకంగా మారుతుంది. కెరీర్ కు అంత ముఖ్యమైన సినిమాను సరైన టైమింగ్ చూసి జాగ్రత్తగా రిలీజ్ చేసుకోవాల్సిన సునీల్.. కొంచెం ఆవేశపడుతున్నట్లుగా ఉంది.

ఇప్పటికే దసరాకు బోలెడన్ని సినిమాలుండగా.. ‘ఈడు గోల్డ్ ఎహే’ను కూడా పండగ సీజన్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇంకా డేటు కన్ఫమ్ కాలేదు కానీ.. ‘దసరా రిలీజ్’ అంటూ పోస్టర్ మీద వేసేశారు. నిజానికి ఈ సినిమాను సెప్టెంబరు 9కే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి సినిమా రెడీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో వాయిదా పడింది. ఐతే సెప్టెంబరు 23న ఒక డేటు ఖాళీగా ఉంది. కొంచెం కష్టపడితే ఆ డేటు ఖాయం చేసుకోవచ్చు. ఐతే అప్పటికి కూడా సినిమా రెడీ కాదనుకున్నారో లేక.. దసరా మీద మోజో కానీ.. సినిమానైతే పండక్కే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. దసరాకు రావాల్సిన భారీ సినిమా ‘ధృవ’ విషయంలో కొంచెం సందేహాలు నెలకొన్న మాట వాస్తవమే కానీ.. దాన్ని పక్కనబెట్టేసినా ప్రేమమ్.. ఇజం.. అభినేత్రి.. మనఊరి రామాయణం లాంటి సినిమాలు బరిలో ఉన్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య సునీల్ సినిమా ఉనికిని చాటుకుంటుందా?
Tags:    

Similar News