'సైరా' స్టంట్ మాస్టర్ ఏం చెప్పాడులే..

Update: 2018-08-21 15:19 GMT
లీ విటేకర్.. ‘బాహుబలి’ సినిమా కోసం ఇండియాకు వచ్చిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్. అతడినే ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం తీసుకున్నారు. లీతో పని చేయడం గొప్ప అనుభవమని.. ‘సైరా’కు అతను అద్భుతమైన స్టంట్స్ సమకూరుస్తున్నాడని ‘సైరా’ టీజర్ లాంచ్ సందర్భంగా కితాబిచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో లీ కూడా పాల్గొనడం విశేషం. వేదిక ఎక్కి కూర్చున్న అతడికి విలేకరుల నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘మీరు అమెరికాకు చెందిన వ్యక్తి కదా.. బ్రిటిష్ వారితో పాటు అమెరికన్లు కూడా తెల్లవాళ్లే. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీ తెల్లవారిని చంపుతుంటే ఎలా అనిపిస్తోంది’ అని లీని ప్రశ్నించారు.

‘‘ఇది చాలా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఐతే తెల్లవారు నల్ల వారు అనే తేడా లేదు. దేశభక్తి ఎక్కడైనా దేశభక్తే. ఈ చిత్రం స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరకెక్కుతోంది. కాబట్టి తెల్లవారిని చంపడానికి ‘సైరా’కు నేను కూడా సాయం చేస్తున్నా అని లీ అన్నాడు. ఈ సినిమాకు పని చేసిన అనుభవం గురించి అతను చెబుతూ.. ‘‘స్వాతంత్య్రం వైపు ఓ వ్యక్తి వేసిన అడుగులు ఒక జాతినే ఉత్తేజపరిచాయంటూ ఈ కథను నాకు చెప్పినప్పుడు, నన్ను ఇందులో భాగమవ్వమని అడిగినప్పుడు కదిలిపోయాను. ఈ సినిమాలో పనిచేయడం గౌరవంగా భావించాను. ఎంతోమంది మహిళలు పనిచేస్తున్న ఈ ప్రాజెక్టులో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నాడు.


Tags:    

Similar News