థియేట‌ర్స్ వదులుకొని ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్..?

Update: 2021-05-25 17:30 GMT
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోయే రోజుల్లో సుమారు పది సినిమాలు రాబోతున్నాయి. వీటిలో మీడియం బడ్జెట్ తెలుగు సినిమాతో పాటుగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ - బాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు.. ముందుగా చాలా వ‌రకు థియేట‌ర్స్ ని వ‌దులుకోబోతున్నాడ‌ని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఈ ఏడాదితో లీజ్ అగ్రిమెంట్స్ ముగిసే అవ‌కాశం ఉండ‌టంతో తన ఆధీనంలో ఉన్న కొన్ని థియేట‌ర్స్ ని వ‌దులుకోవాల‌ని దిల్ రాజు ఆలోచిస్తున్నారట. కరోనా పరిస్థితుల్లో వీటి నిర్వ‌హ‌ణ భారంగా మార‌డంతోనే స్టార్ ప్రొడ్యూసర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా నడుస్తుండటంతో దిల్ రాజు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తెలుగు ఓటీటీ 'ఆహా' లో తన కుటుంబ సభ్యులను భాగస్వాములుగా చేసిన దిల్ రాజు.. మ‌రోవైపున తానే స్వ‌యంగా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ప్రారంభించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దిల్ రాజు సినిమాల విషయానికొస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్‌ - వరుణ్‌ తేజ్‌ లు హీరోలు.

ఇదే క్రమంలో నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో 'థాంక్యూ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని నటిస్తున్న 'శాకుంతలం' చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తమ ఫ్యామిలీ హీరో ఆశిష్ ని పరిచయం చేస్తూ 'రౌడీ బాయ్స్' సినిమా చేస్తున్నాడు. క్రిష్ తో కలిసి అవసరాల శ్రీనివాస్‌ హీరోగా 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు' అనే సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు.

ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌ లో ఓ పాన్‌ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. అలానే తమిళ్ స్టార్ హీరో విజయ్ - వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు ఓ బైలింగ్వల్ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడని సమాచారం. ఇక హిందీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతున్న దిల్ రాజు.. తెలుగులో సక్సెస్ అయిన 'జెర్సీ' చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ నిర్మాతలతో కలిసి 'హిట్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు.
Tags:    

Similar News