నారీ నారీ నడుమ మురారి.. ఆడియెన్స్ కు గుడ్ న్యూస్
ఈ సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాలు కూడా ఇదే బాటలో ఉండటంతో ఆడియన్స్ లో కొంత ఆందోళన ఉంది. అయితే శర్వానంద్ టీమ్ మాత్రం ఈ విషయంలో ఒక డిఫరెంట్ నిర్ణయం తీసుకుంది.;
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. గతంలో 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' వంటి సినిమాలతో భారీ పోటీ ఉన్నా బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో 'నారీ నారీ నడుమ మురారి' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది.
'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో వినోదానికి లోటుండదని ప్రేక్షకులు భావిస్తున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయంటే చాలు, టికెట్ రేట్ల పెంపు గురించి చర్చ మొదలవుతుంది. భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడి త్వరగా రావడానికి నిర్మాతలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని రేట్లు పెంచుతుంటారు.
దీనివల్ల పండగ పూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడుతుంది. ఈ సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాలు కూడా ఇదే బాటలో ఉండటంతో ఆడియన్స్ లో కొంత ఆందోళన ఉంది. అయితే శర్వానంద్ టీమ్ మాత్రం ఈ విషయంలో ఒక డిఫరెంట్ నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ గా జరిగిన ఈవెంట్‌లో శర్వానంద్ ఒక కీలక ప్రకటన చేశాడు. తమ సినిమా టికెట్ ధరలను ఎక్కడా పెంచడం లేదని, అన్ని థియేటర్లలో ఎంఆర్‌పీ (MRP) రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశాడు.
సంక్రాంతి రేసులో ఉన్న మిగతా పెద్ద సినిమాలు రేట్లు పెంచుకుంటున్నా, శర్వానంద్ తన సినిమాకు రెగ్యులర్ రేట్లనే ఉంచడం విశేషం. ఇది ఖచ్చితంగా ఒక తెలివైన ఎత్తుగడ అని చెప్పవచ్చు. తక్కువ ధరకే టికెట్ దొరుకుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం శర్వానంద్‌కు కొత్తేమీ కాదు. గతంలో లాగే ఈసారి కూడా తన కామెడీ ఎంటర్‌టైనర్‌తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. టికెట్ రేట్లు పెంచకపోవడం అనేది శర్వానంద్‌కు ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా మారనుంది. మరీ ఎక్కువ అంచనాలు లేకపోయినా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం కోసం చూసే వారికి ఈ సినిమా ఒక ఆప్షన్‌గా నిలవనుంది.
నిజానికి బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే టాక్ చాలా ముఖ్యం. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ రాకపోయినా, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఉంటే లాంగ్ రన్ లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. శర్వానంద్ మార్కెట్ రేంజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా బిజినెస్ కూడా డీసెంట్ గానే జరిగింది. మరి ఈ టికెట్ రేట్ల వ్యూహం సినిమా విజయానికి ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.