'స్కైలాబ్'తోనైనా ఆ ఓటీటీ వేదిక పుంజుకునేనా..?

Update: 2022-01-14 01:30 GMT
డిజిటల్ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులకు ఓటీటీలు శ్రీకారం చుట్టాయి. వినోదం కోరుకునే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమొచ్చిన మాధ్యమాలలో నచ్చిన కంటెంట్ ను వీక్షించడానికి ఈ వేదికలు అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లలో కరోనా పాండమిక్ సమయంలో ఓటీటీలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గంగా మారాయి.

ఈ నేపథ్యంలో అప్పటికే సత్తా చాటుతున్న ఓటీటీలతో పాటుగా.. ఇంకొన్ని సరికొత్త ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందిస్తూ.. కొత్త స్ట్రాటజీలతో వీక్షకులను ఆకట్టుకున్న ఓటీటీలు మాత్రమే సబ్ స్క్రైబర్స్ ను పెంచుకున్నాయి. రాబోయే రోజుల్లో ఓటీటీనే పెద్ద బిజినెస్ అని భావించి ఈ రంగంలోకి వచ్చిన కొన్ని డిజిటల్ వేదికలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో 'సోనీ లివ్' ఓటీటీ తెలుగులో అడుగుపెట్టింది. న్యూ పీచర్స్ తో కొత్త సినిమాలు - వెబ్ సిరీస్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే.. ఈ ఫ్లాట్ ఫార్మ్ ఆశించిన స్థాయిలో ఆదరణ తెచ్చుకోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సోనీ లైవ్ ఓటీటీ ఇతర భాషల్లో పాపులర్ అయిన పలు ఒరిజినల్ సిరీస్ లను తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ పెడుతోంది. అలానే కొన్ని తెలుగు సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు. 'వివాహ భోజనంబు' 'ఫ్యామిలీ డ్రామా' '#బ్రో' 'WWW' వంటి సినిమాలని నేరుగా విడుదల చేసారు. సోనీ లివ్ అనే ఒక ఓటిటి ఉందనే విషయమే జనాలకు పెద్దగా తెలియకపోవడంతో.. అందులో రిలీజ్ అయిన ఈ చిత్రాలకు ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ ''స్కైల్యాబ్'' అనే కొత్త సినిమాని స్ట్రీమింగ్ కు రెడీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ ప్రీమియర్ కానుంది. సత్యదేవ్ - నిత్యామీనన్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. విశ్వక్ కందెరావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ - నిత్యామీనన్ కంపెనీ బ్యానర్స్ పై పృథ్వీ పిన్నమరాజు - నిత్యా మీనన్ సంయుక్తంగా నిర్మించారు.

అమెరికా మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ భూమ్మీద పడుతుందని 1979లో జరిగిన ప్రచారం నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లాలోని బండ లింగంపల్లి గ్రామంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ కామెడీ డ్రామాని రూపొందించారు. డిసెంబర్ 4న రిలీజ్ అయిన 'స్కైలాబ్' సినిమా థియేటర్లలో ప్రభావం చూపించలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో.. సోనీ లివ్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News