37 రోజుల్లో 13 కేజీలు త‌గ్గాడు

Update: 2019-05-03 16:25 GMT
వివాదాలు ఓ వైపు.. ప్ర‌తిభ ఇంకో వైపు..!! ఈ రెండు కోణాల్లో హీరో శింబు ప‌నిత‌నం గురించి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ .. విక్ర‌మ్.. అజిత్ త‌ర‌హాలోనే కెరీర్ లో ప్ర‌యోగాల‌కు సిద్ధంగా ఉండే యంగ్ హీరోగా శింబుకి పేరుంది. కెరీర్ ఆరంభ‌మే అత‌డు చేయ‌ని ప్ర‌యోగ‌మే లేదు. సీనియ‌ర్ల బాట‌లో అత‌డు ప్ర‌తిసారీ ఏదో ఒక‌ కొత్త‌ద‌నం కోసం త‌పించాడు. అయితే త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో కొన్ని రాజ‌కీయాలు.. ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని వివాదాలు శింబు కెరీర్ ఎదుగుద‌ల‌కు పెద్ద అడ్డంకిగా మారాయి.

అయినా అత‌డి ప్ర‌తిభ‌ను గుర్తించి గ‌తంతో సంబంధం అన్న‌దే లేకుండా అవ‌కాశాలిచ్చే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కోకొల్ల‌లుగా ఉన్నారు. ఇటీవ‌లే న‌వాబ్ (చెక్క చివంత వానం) చిత్రంలో శింబు సాలిడ్ పెర్ఫామెన్స్ కి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత అత‌డు వ‌రుస‌గా ప‌లు క్రేజీ  ప్రాజెక్టుల‌కు క‌మిట‌య్యాడు. ప్ర‌స్తుతం వంత రాజ‌వ‌తాన్.. మానాడు.. మ‌హా అనే చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే రిలీజైన `90 ఎంఎల్` చిత్రంలోనూ అతిధిగా మెరిసాడు.

ప్ర‌స్తుతం `మానాడు` షూటింగ్ కోసం అత‌డు ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు. ఇటీవ‌లే ఓ పెళ్లి రిసెప్ష‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మైన అత‌డిని ఫ్యాన్స్ సైతం గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. అంత‌గా మారిపోయి క‌నిపించాడు. అయితే ఇది మానాడు కోసం వ‌చ్చిన ఛేంజోవ‌ర్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం శింబు లుక్ మొత్తం మార్చేశాడు. కేవ‌లం 37 రోజుల్లో అత‌డు ఏకంగా 13 కేజీల‌ బ‌రువు త‌గ్గాడు. అందుకోసం నిరంత‌రం జిమ్ముల్లో క‌ఠోరంగా శ్ర‌మిస్తూ.. ఓ క్ర‌మ‌ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఆహారం పుచ్చుకున్నాడు. బ‌రువు పెంచే అన్ని ప్ర‌దార్థాల్ని త‌గ్గించాడ‌ట‌. లండ‌న్ లో ఓ సుశిక్షితుడైన‌ ట్రైనర్ వ‌ద్ధ ప్ర‌త్యేకించి బ‌రువు త‌గ్గేందుకు శిక్ష‌ణ పొందాడ‌ని తెలుస్తోంది. అక్క‌డే మార్ష‌ల్ ఆర్ట్స్ లోనూ శిక్ష‌ణ పొందాడు. తాజా లుక్ ప్ర‌స్తుతం  కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు మార‌డం.. ఈ త‌ర‌హాలో క్యారెక్ట‌ర్ కోసం రూపాన్ని మార్చుకోవ‌డం అన్న‌ది శింబుకి ఇప్పుడే కొత్తేమీ కాదు. గ‌తంలోనూ ఎన్నోసార్లు అవ‌స‌రానికి బ‌రువు పెరిగిన సంద‌ర్భాలున్నాయి. కొత్త లుక్ కోసం స్లిమ్ గా మారిపోయి పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయ‌డం అత‌డికి వెన్న‌తో పెట్టిన విద్య‌. హీరోల్లో చ‌క్క‌ని హార్డ్ వ‌ర్క్- డెడికేష‌న్ ఉన్న స్టార్ గా శింబు కి ప్ర‌త్యేకించి ఐడెంటిటీ ఉంది. `మానాడు` చిత్రానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ కామ‌చ్ఛి నిర్మాత‌. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ నాయిక‌గా న‌టిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ క‌థాంశంతో ఈ భారీ చిత్రం రూపొందుతోంది.    
    

Tags:    

Similar News