'వరుణ్ డాక్టర్' ఓ ఇంట్రెస్టింగ్ మైండ్ గేమ్: హీరో శివకార్తికేయన్

Update: 2021-10-07 08:30 GMT
తమిళనాట మాంఛి దూకుడు మీదున్న యువ హీరోల్లో శివకార్తికేయన్ ఒకరుగా కనిపిస్తాడు. మాస్ హీరోల్లో ఆయనకి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అడపా దడపా ఆయన తమిళ సినిమాలు కొన్ని తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాయి. అందువలన ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే ఇక్కడ మార్కెట్ పెంచుకోవడానికి ఈ మాత్రం ముఖ పరిచయం సరిపోదు. ఊళ్లో కలవనివాడు పొలిమేరలో ఉన్నట్టేనని అన్నట్టుగా పెద్దగా పట్టించుకోరు. అందువలన శివ కార్తికేయన్ తెలుగులోను కుదురుకోవాలనే ఆలోచన చేస్తున్నాడు.

రజనీ .. కమల్ తమిళ హీరోలుగా అనుకోము. అలాగే విక్రమ్ .. సూర్య .. కార్తి కూడా తమ హీరోలుగానే ఇక్కడి ప్రేక్షకులు భావిస్తుంటారు. వీరితో పోల్చుకుంటే తమిళనాట వసూళ్ల వస్తాదులుగా పిలవబడే అజిత్ .. విజయ్ లు ఆశించిన స్థాయిలో ఇక్కడి ప్రేక్షకులకు చేరువ కాలేకపోయారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగానే గ్రహించి, ఇప్పుడిప్పుడే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ ఏకంగా .. నేరుగా తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడానికి శివ కార్తికేయన్ కూడా రంగంలోకి దిగిపోయాడు.

తెలుగులో నాని మాదిరిగానే తమిళంలో శివకార్తికేయన్ కూడా కష్టపడి తనని తాను నిరూపించుకున్న హీరో. కథ .. స్క్రీన్ ప్లే విషయంలో ఆయనకి మంచి అవగాహన ఉంది. అలాగే ఆయన పాటలు బాగా పాడతాడు. సినిమాల్లో గాయకుడిగా ప్రయోగాలు కూడా చేస్తుంటాడు. టీవీ షోస్ లో హోస్ట్ గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు .. ధనుష్ మాదిరిగా పాటలు రాసే అలవాటు కూడా ఈ హీరోకి ఉంది. ఇక నిర్మాతగా కూడా మారిపోయిన ఆయన, తన సొంత బ్యానర్లో 'డాక్టర్' సినిమాను నిర్మించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయడానికి శివ కార్తికేయన్ సిద్ధమైపోయాడు. 'వరుణ్ డాక్టర్' టైటిల్ తో ఈ సినిమాను తెలుగు  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి స్టార్ హోటల్లో చిన్నపాటి ఈవెంట్ ను ప్లాన్ చేసి సందడి చేశాడు. టీవీ ఛానల్స్ కీ .. వెబ్ సైట్స్ కి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తన మాట తీరుతో .. మర్యాదపూర్వకమైన ప్రవర్తనతో ఆయన మీడియా మనసులు గెలుచుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

శివకార్తికేయన్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయన జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనుంది. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. "ఈ సినిమాలో హీరో .. ఆర్మీ డాక్టర్ గా కనిపిస్తాడు. ఒకసారి సొంత ఊరు వచ్చిన అతనికి అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడనేదే కథ. ప్రతి సీన్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా హీరోకి .. విలన్ కి మధ్య నడిచే మైండ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది" అని శివకార్తికేయన్ చెప్పాడు. త్వరలోనే తాను నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చెప్పుకొచ్చాడు.   
Tags:    

Similar News