గుణశేఖర్ చెప్పే ప్రేమకథలో 'శకుంతల' ఈ బ్యూటీయేనా...?

Update: 2020-10-10 06:45 GMT
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ లేటెస్టుగా 'శాకుంతలం' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ''వెండితెరపై 'హిరణ్యకశ్యప' లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను'' అని గుణశేఖర్ ప్రకటించాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న 'శాకుంతలం' మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. 'మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ' అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. ఇందులో నటించే నటీనటుల వివరాలు వెల్లడించలేదు. అయితే 'శకుంతల' గురించి మనకు అనేక రకాల కథలు అందుబాటులో ఉన్నాయి.

మహాభారతం ఆదిపర్వంలో శకుంతలా దేవి - దుష్యంత మహారాజుల ప్రేమకథ ఉంటుంది. విశ్వామిత్రుడు - మేనకల కుమారై అయిన శకుంతల కణ్వ మహర్షి దత్తపుత్రికగా ఆశ్రమంలో పెరిగి పెద్దదవుతుంది. ఒకసారి దుష్యంత మ‌హారాజు అడవులకు వేటకు వెళ్లి అక్కడ శకుంతలను చూసిన తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని.. సకల రాచ మర్యాదలతో మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. అయితే భ‌ర్త‌ను త‌లుచుకుంటూ పరధ్యానంలో ఉన్న శకుంతల.. ఆశ్ర‌మానికి వ‌చ్చిన దూర్వాస మ‌హ‌ర్షిని ప‌ట్టించుకోనందుకు శ‌కుంత‌ల‌ను ఆయ‌న శ‌పిస్తాడు. ఈ శాపం వ‌ల్ల దుష్యంత మహారాజు శకుంత‌ల‌ను మ‌రిచిపోతాడు. త‌ర్వాత శ‌కుంత‌ల భ‌ర‌తుడికి జ‌న్మ‌నిస్తుంది. అనేక ప‌రిణామాల త‌ర్వాత‌ దుష్యంతుడు భార్య శకుంతల ద‌గ్గ‌రికి వ‌స్తాడు. ఇదే ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ. భరతదేశం ఆవిర్భవానికి మూలకారణమైన భరతుడి తల్లిదండ్రులైన శకుంతల - దుష్యంతుడిల ప్రేమ కథను ఇప్పుడు గుణశేఖర్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు శకుంతలా దేవి పాత్రను ఎవరు పోషిస్తారనే డిస్కషన్ జరుగుతోంది. దుష్యంతుడితో ఆమె ప్రేమ.. వారి గాంధర్వ వివాహం.. భర్తకు దూరమై కష్టాలు అనుభవించడం ఇలా అనేక అంశాలు శకుంతల ప్రేమ కథలో మిళితమై ఉంటాయి. అలాంటి పాత్రకు ఎవరు న్యాయం చేస్తారు అని చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్ అనుష్క'శకుంతల'గా నటించనుందని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇంతకముందు గుణశేఖర్ దర్శకత్వం వహించిన చారితాత్మక చిత్రం 'రుద్రమదేవి' సినిమాలో అనుష్క టైటిల్ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'శాకుంతలం' సినిమాలో కూడా ఆమెనే తీసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Full View
Tags:    

Similar News