ఇష్టమైన ప్లాట్ ను పైలెట్ కు అద్దెకు ఇచ్చిన హీరో!
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వెండితెరపైనే కాదు. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వెండితెరపైనే కాదు. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి పెట్టింది పేరైన అక్షయ్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలోనూ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచిన అంధేరీ వెస్ట్ లో ఉన్న తన విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చి వార్తల్లో నిలిచారు.
అక్షయ్ కుమార్ తనకు ఎంతో ఇష్టమైన ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 కమాండర్ పైలట్ కు అద్దెకు ఇవ్వడం విశేషం. ముంబై వంటి నగరంలో అగ్ర తారలకు చెందిన ఇళ్లలో నివసించడం అంటే అది ఒక హోదాగా భావిస్తారు. ఇప్పుడు ఒక పైలట్ ఈ స్టార్ హీరో ఇంటిని తన నివాసంగా మార్చుకోబోతున్నారు. దీనికి సంబంధించిన అద్దె ఒప్పందం , ఇతర ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది.
ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ నెలవారీ అద్దె దాదాపు 1.50 లక్షలుగా నిర్ణయించబడింది. అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒబెరాయ్ స్ప్రింగ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో అక్షయ్‌కు పలు ప్రోపర్టీస్ ఉన్నాయి. ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ ఆధునిక వసతులతో పాటు, అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌ను కలిగి ఉంది. అక్షయ్ స్వయంగా పర్యవేక్షించి డిజైన్ చేయించుకున్న ఈ ఫ్లాట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి.
అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లుగా ముంబైలోని వివిధ ప్రాంతాలలో భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడుతున్నారు. తన సంపాదనను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆయన తన ఆర్థిక పునాదిని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. కేవలం అపార్ట్‌మెంట్లే కాకుండా కమర్షియల్ స్పేస్‌లను కూడా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే పైలట్‌కు తన ఇంటిని అద్దెకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అక్షయ్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తుంటారు. తన వద్ద ఉన్న ఆస్తులను వృథాగా ఉంచకుండా ఇలా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సృష్టించడం ఆయనలోని వ్యాపార దక్షతకు నిదర్శనం. ఇలాంటి విషయాల్లో యవతరం హీరోలు అక్షయ్ కుమార్‌ను ధీమాగా అనుసరించొచ్చు.
డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో? బాగా తెలిసిన నటుడిగా అక్షయ్ కుమార్ కు పేరుంది.