టెక్ గురూ సంచలనం: టాలీవుడ్ నిర్మాతలు భయపడుతున్నారు!
మారుతున్న టెక్నాలజీని గమనిస్తే.. భవిష్యత్తులో ఫిలింమేకింగ్ అనేది మునుపెన్నడూ లేనంత సులువైన ప్రక్రియ కాబోతోందని స్పష్టమవుతోంది.;
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనేది ఒక రెండువైపులా పదునున్న చాకులా మారింది. దీనిని పాజిటివ్‌గా వాడితే అద్భుతాలు సృష్టించవచ్చు..నెగటివ్‌గా వాడితే అంతే స్థాయిలో నష్టాలు ఉంటాయి. అయితే భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల ధాటికి లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్ల అవసరం తగ్గిపోవడమే కాకుండా... విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నిపుణులతో కూడా పని ఉండదని టెక్ గురూలు హెచ్చరిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఎస్.ఎస్. రాజమౌళి - కె.ఎల్. నారాయణ బృందం చిత్రం `వారణాసి`లాంటి సినిమాలపై కూడా పడబోతోందని విశ్లేషకులు చెబుతుండటం ఆశ్చర్యకరం.
మారుతున్న టెక్నాలజీని గమనిస్తే.. భవిష్యత్తులో ఫిలింమేకింగ్ అనేది మునుపెన్నడూ లేనంత సులువైన ప్రక్రియ కాబోతోందని స్పష్టమవుతోంది. క్రియేటివిటీతో పాటు సరైన సాంకేతిక పరిజ్ఞానం సంపాదిస్తే.. అత్యంత వేగంగా సినిమాలను నిర్మించి విడుదల చేయవచ్చు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ టూల్స్ వినోద రంగంలో పెను మార్పులకు నాంది పలకబోతున్నాయి. ఈ నేపథ్యంలో `వారణాసి` వంటి భారీ బడ్జెట్ చిత్రాల మేకర్స్ తమ షూటింగ్ ప్లాన్స్‌ను మరో ఒకటి రెండేళ్ల పాటు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే విజువల్స్ మరో రెండేళ్లలో అందివచ్చే సాంకేతికతతో చాలా తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నారు.
ఏఐ విప్లవం ఏ స్థాయిలో ఉందంటే.. 2026లో ఉన్న టెక్నాలజీ 2027 నాటికి పాతబడిపోతుంది. ప్రతి ఏడాది కొత్త కొత్త ఆవిష్కరణలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ - వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఈ ఏడాది రూ. 30 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే... మరో ఏడాది లేదా రెండేళ్లలో అదే పనిని కేవలం రూ. 15 కోట్లలోనే పూర్తి చేసే సాంకేతికత అందుబాటులోకి రావచ్చు. అంత పెద్ద మొత్తాన్ని ఆదా చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు.. ఏ నిర్మాత అయినా ఇప్పుడే ఎందుకు సాహసం చేస్తారు? అందుకే మరికొంత కాలం వేచి చూసి అడ్వాన్స్‌డ్ వెర్షన్లతో సినిమా తీయడమే లాభదాయకమని బడా నిర్మాతలు విశ్లేషిస్తున్నారని టాక్.
మునుముందు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కారణంగా సినిమా రంగంలో నిపుణుల అవసరం గణనీయంగా తగ్గిపోనుంది. వీఎఫ్ఎక్స్ నిపుణుల అవసరం లేకుండానే ఏఐ సాఫ్ట్‌వేర్లు అద్భుతమైన విజువల్స్‌ను సృష్టించగలవు. పాట పాడాలన్నా ఇప్పుడు గాయనీ గాయకుల అవసరం లేదు.. ఏఐ వాయిస్ సింథసిస్ ద్వారా అచ్చం మనిషి గొంతుతోనే పాటలను పుట్టించవచ్చు. ఇలా ప్రతి విభాగంలోనూ ఖర్చులు తగ్గించుకుంటూ సినిమాను వేగంగా పూర్తి చేసే వీలుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది సాంకేతిక ఉద్యోగుల ఉపాధిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
గూగుల్‌లో `సీ డాన్స్ 2.ఓ` (SeaDance 2.0) అని సెర్చ్ చేస్తే ఈ సాంకేతికత ఎంత అడ్వాన్స్‌డ్ గా ఉందో అర్థమవుతుంది. మునుముందు రానున్న దీని అడ్వాన్స్‌డ్ వెర్షన్ల సాయంతో కేవలం పది రోజుల్లోనే పూర్తి స్థాయి సినిమాను తీసేయగలిగే స్థాయికి టెక్నాలజీ చేరుకోనుంది. నిజానికి `వారణాసి` వంటి భారీ చిత్రాన్ని కొన్నేళ్ల తర్వాత ఇంత సమయం వృథా చేస్తూ తీయరు. భవిష్యత్తులో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెడుతున్న ఖర్చంతా వృధా అనిపిస్తుందని కొందరు భావిస్తున్నారు. అందుకే చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక రకమైన స్థబ్ధత నెలకొందని, చాలా బడా ప్రాజెక్టులను పట్టాలెక్కించే ముందు నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని టెక్ గురూలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ముఖ్యంగా `సీ డాన్స్ 4.ఓ` వంటి అడ్వాన్స్‌డ్ వెర్షన్లు అందుబాటులోకి వస్తే... క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా అతి తక్కువ ఖర్చుతోనే దృశ్యకావ్యాలను తెరకెక్కించవచ్చు. రాజమౌళి కూడా `వారణాసి`ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారని అమీర్ పేట్ నుంచి దిల్ సుఖ్ నగర్ వరకూ టెక్ విద్యార్థుల కోచింగులను శాసించే సదరు టెక్ గురూ వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటే సినిమా మేకింగ్ ప్రక్రియ కొన్ని రోజుల్లోనే తక్కువ ఖర్చుతో ముగుస్తుంది. ఒకవేళ ఇప్పుడే పాత పద్ధతుల్లో భారీ బడ్జెట్ పెడితే.. రేపు కొత్త టెక్నాలజీ వచ్చాక ఆ పెట్టుబడి అనవసరం అనిపించవచ్చు. ఈ భయం వల్లనే చాలా మంది కొత్త సినిమాలు ప్రారంభించడానికి జంకుతున్నారని టెక్ గురూ విశ్లేషించారు. సాంకేతికతలో ఎదుగుదల ఉద్యోగాలను కోసేయడం బాధాకరమే అయినా, ఫిలింమేకింగ్ సమయాన్ని, ఖర్చును అత్యంత తక్కువ దశకు కుదించేయడం నిజంగా ఆనందించదగినదే కావొచ్చు.