పర్సనల్ బ్రాండింగ్ హీరోయిన్లకు రక్షణ కవచంలా!
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో హీరోయిన్ భవిష్యత్తును ఆమె నటించిన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలే నిర్ణయించేవి.;
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో హీరోయిన్ భవిష్యత్తును ఆమె నటించిన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలే నిర్ణయించేవి. సినిమా హిట్టయితే అవకాశాలు వెల్లువెత్తేవి. ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర పడి కెరీర్ ప్రమాదంలో పడేది. కానీ నేడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ విజయాల కంటే హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, పర్సనల్ బ్రాండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ , ఫోటోషూట్ల తో వచ్చే పాపులారిటీయే కెరీర్ గ్రాఫ్‌ను నిర్ణయించే ప్రధాన కారకాలుగా మారుతున్నట్లే కనిపిస్తోంది.
సినిమా ఫలితం ఎలా ఉన్నా? సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేసుకోవడానికి మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం డిజిటల్ రీచ్. ఒక పాపులర్ హీరోయిన్ తన అకౌంట్‌లో సినిమా పోస్టర్ లేదా సాంగ్ షేర్ చేస్తే? అది క్షణాల్లో కోట్లాది మందికి చేరుతుంది. ఇది సినిమా ప్రమోషన్ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. ఈ రకమైన ప్రచారం థియేటర్లకు యువతను ఆకర్షించడానికి సులభమైన మార్గంగా మారుతోంది. అందుకే ఫ్లాపుల్లో ఉన్నా క్రేజీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గడం లేదు.
అలాగే పర్సనల్ బ్రాండింగ్ అనేది హీరోయిన్లకు ఓ రక్షణ కవచంలా పని చేస్తోంది. వెండితెరపై సినిమా ఫెయిల్ అయినా? బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కమర్షియల్ యాడ్స్ , డిజిటల్ కొలాబరేషన్ల ద్వారా తమ క్రేజ్‌ను పదిలంగా ఉంచుకుంటున్నారు. దీంతో నిర్మాతలు కూడా సదరు హీరోయిన్ కేవలం నటిగానే కాకుండా? ఒక కమర్షియల్ బ్రాండ్ గా సినిమాకు అదనపు ఆకర్షణను తీసుకొస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ సక్సెస్ రేటు కంటే ఇంటర్నెట్ ఎంగేజ్మెంట్ రేటుకు విలువ పెరుగుతోంది.
అయితే ఈ కొత్త ట్రెండ్ వల్ల ప్రతిభావంతులైన కొత్తవారికి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కేవలం సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను చూసి అవకాశాలు ఇస్తుండటంతో అద్భుతమైన నటన సామర్థ్యం ఉన్నప్పటికీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా లేని నటీమణులు వెనుకబడిపోతున్నారు. మేకర్స్ కూడా నటన కంటే స్క్రీన్ అప్పీల్ , ఆన్‌లైన్ క్రేజ్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో బలమైన పాత్రలు చేసే నటీమణుల కంటే గ్లామర్ తారలకే ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
సినిమా విజయం - సోషల్ మీడియా క్రేజ్ మధ్య సమతుల్యత ఉండటం అవసరం. కేవలం ఆన్‌లైన్ పాపులారిటీతో కొంతకాలం కెరీర్‌ను నెట్టుకురావచ్చు. కానీ సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో నిలబడాలంటే మాత్రం నటనతో సత్తా చాటాల్సిందే. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది అదనపు అర్హత కావాలి తప్ప అదే ప్రాథమిక అర్హత కాకూడదు. అప్పుడే సినిమా పరిశ్రమలో ప్రతిభకు , పాపులారిటీకి సమన్యాయం జరుగుతుంది. అలాగే ప్రేక్షకులకు కూడా నాణ్యమైన నటన ఆస్వాదించగల్గుతారు.