పాత సంగతులు మరిచిపోయావా సల్మాన్?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో `బిగ్ బాస్ 20` వేదికగా చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో `బిగ్ బాస్ 20` వేదికగా చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో సల్మాన్ తనపై వస్తున్న బాడీ షేమింగ్, ట్రోలింగ్‌కు సమాధానంగా షర్టు విప్పి వేదికపై నిరసన తెలపగా దీనిపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయాత్ ఘాటుగా స్పందించారు. సల్మాన్‌ను అత్యంత ద్వంద్వ నీతి కలిగిన వ్యక్తి గా అభివర్ణిస్తూ గతంలో తన రూపంపై ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.
ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ 20 వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ తన ఫిజిక్, వయసు, పెరుగుతున్న బరువుపై సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోపీ, షర్టు తొలగించి బాడీని చూపిస్తూ సల్మాన్ లావు అయ్యాడని ట్రోల్ చేస్తున్నారా? ఇదిగో చూడండి.. క్లోజప్‌లో చూసి ఎంతైనా ట్రోల్ చేసుకోండి అంటూ ట్రోలర్లకు సవాల్ విసిరారు. వేదికపై సల్మాన్ చేసిన షర్ట్‌లెస్ హంగామా నెట్టింట బాగా వైరల్ అయింది. అంతటితో ఆగకుండా సెలబ్రిటీల వ్యక్తిగత రూపాలపై విమర్శలు చేసేవారికి సల్మాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇతరుల ముఖాలు, శరీరాల గురించి కామెంట్లు చేసే ముందు ట్రోలర్లు అద్దంలో తమ సొంత రూపాలను, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాలని హితవు పలికారు. బరువు పెరిగారని లేదా తగ్గరని అనడంలో అర్థముంది కానీ ఉద్దేశపూర్వకంగా హేళన చేయడం సరికాదని మండిపడ్డారు. ఇటీవల తల్లి అయిన కత్రినా కైఫ్‌పై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ కాగానే సోఫియా హయాత్ ఎక్స్ వేదికగా ఆ వీడియోను రీషేర్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
`సల్మాన్ ఒక ద్వంద్వ నీతి కలిగిన వ్యక్తి. నేను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు నా శరీరం, ముఖంపై ఆయన అనుచిత విమర్శలు చేశారు. కానీ అదే సమయంలో గౌహర్ ఖాన్ ఫిజిక్ చాలా బాగుందని పొగిడారు` అని సోఫియా ఆరోపించారు. ఒకప్పుడు ఇతరులను బాడీ షేమింగ్ చేసిన సల్మాన్ ఇప్పుడు తనకు జరిగేసరికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2013లో ప్రసారమైన `బిగ్ బాస్ 7`లో సోఫియా హయాత్ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆ సీజన్ విజేతగా గౌహర్ ఖాన్ నిలవగా, తనీషా ముఖర్జీ రన్నరప్‌గా నిలిచారు.
ఆ సీజన్ సమయంలోనే తన రూపాన్ని ఉద్దేశించి సల్మాన్ చేసిన కామెంట్లు తనను ఎంతగానో బాధించాయని సోఫియా గుర్తు చేసుకున్నారు. ఇతరులను విమర్శించేటప్పుడు లేని నైతికత, తనపై విమర్శలు వచ్చేసరికి గుర్తుకు రావడం సల్మాన్ నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మళ్లీ పాత వివాదాలు చెలరేగాయి. ఒకవైపు సల్మాన్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా మరోవైపు సోఫియా వ్యాఖ్యలను సమర్థిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.