వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేరు బెటర్.. విజయ్ దేవరకొండ ఎంట్రీతో మరింత హీట్!

వరంగల్‌లో ప్రతిపాదిత విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Update: 2026-09-20 16:38 GMT

వరంగల్‌లో ప్రతిపాదిత విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎయిర్‌పోర్టు నిర్మాణం, దాని భవిష్యత్ ప్రాధాన్యతపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా.. తాజాగా దానికి ఏ పేరు పెట్టాలి? అనే అంశం కూడా సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. ఈ చర్చలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు ‘రుద్రమదేవి’ లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేర్లు పరిశీలించవచ్చని సూచించారు. కాకతీయుల చరిత్రతో వరంగల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పేర్లు సరిపోతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ చర్చలోకి వచ్చారు. సందీప్ రెడ్డి వంగా చేసిన సూచన తనకు నచ్చిందని విజయ్ తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చే పేర్లు ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “పవర్‌ఫుల్ ప్రాంతాలకు పవర్‌ఫుల్ పేర్లు ఉండాలి” అన్న విజయ్ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చరిత్రను ప్రతిబింబించే పేరు కావాలా?

వరంగల్‌కు కాకతీయుల చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. రాణి రుద్రమదేవి వంటి చారిత్రక వ్యక్తులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. అందుకే ‘రుద్రమ్మ’, ‘కాకతీయ’ వంటి పేర్లు కేవలం పేర్లుగా కాకుండా వరంగల్ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని సినీ ప్రముఖుల అభిప్రాయాల్లో కనిపిస్తోంది.

అయితే మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం భిన్నమైన పేరును సూచించారు. తెలంగాణ ప్రజల సాంస్కృతిక, చారిత్రక గుర్తింపులో ప్రత్యేక స్థానం ఉన్న సమ్మక్క-సారక్క పేర్లతో ఎయిర్‌పోర్టును పిలిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో వరంగల్ ఎయిర్‌పోర్టు పేరు అంశం ఇప్పుడు ఒక రకంగా సాంస్కృతిక చర్చగా మారుతోంది. ఒకవైపు కాకతీయుల చరిత్రను ప్రతిబింబించే పేర్లు.. మరోవైపు తెలంగాణ గిరిజన, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసే సమ్మక్క-సారక్క పేరు.. ఇలా భిన్నమైన ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి.

అయితే తుది నిర్ణయం మాత్రం అధికారిక ప్రక్రియలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు పేరు ఏదైనా.. వరంగల్ చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును దేశ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసేలా ఉండాలన్నదే ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న అభిప్రాయం.

Tags:    

Similar News