ముంబై విల‌యం RFC కి క‌లిసొచ్చిందా?

Update: 2020-06-12 04:47 GMT
ప్ర‌స్తుతం దేశం అల్ల‌క‌ల్లోలంగా మారింది. మ‌హ‌మ్మారీని అదుపు చేయ‌లేక ప్ర‌భుత్వాలే చేతులెత్తేశాయి. లాక్ డౌన్లు లేవిక‌. ఎవరి క‌ర్మ వారు అనుభ‌వించాల్సిందే! అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఉపాధి లేని చావుల కంటే వైర‌స్ చావులే బెట‌ర్ అని భావించి వ‌దిలేశారు.  దిల్లీ.. ముంబై.. హైద‌రాబాద్ .. మెట్రో ఏదైనా ఇదే ప‌రిస్థితి. వ‌ల‌స కార్మికుల వ‌ల్ల ప‌ల్లెల‌కూ మ‌హమ్మారీ విస్త‌రిస్తోంది.

అయితే ఇలాంటి క్లిష్ఠ స‌మ‌యంలో వినోద‌ప‌రిశ్ర‌మ అత‌లాకుత‌లం అవ్వ‌కుండా ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు స‌డ‌లింపులు ఇచ్చాయి. అన్ని మెట్రోల్లో షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించాయి. కానీ ఎక్క‌డ షూటింగులు చేస్తే సేఫ్ అన్న‌ దానిపై అంతా ఆలోచిస్తున్నారు. ఆ కోవ‌లో చూస్తే అస‌లు మెట్రో న‌గ‌రంతో సంబంధం లేకుండా ఎంతో దూరంగా ఉండే రామోజీ ఫిలింసిటీలో షూటింగులు బెట‌ర్ అని ఇటు తెలుగు నిర్మాత‌లు.. అటు హిందీ నిర్మాత‌లు కూడా భావిస్తున్నార‌ట‌. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల చూపు ఇటువైపే ఉంద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ నుంచి 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిలింసిటీ ఒంట‌రి గా ఉంది. అందువ‌ల్ల అక్క‌డ షూటింగులు చేసుకుంటే మ‌హ‌మ్మారీ కి దూరంగా ఉండొచ్చ‌న్న ఆలోచ‌న లో నిర్మాత‌లంతా ఉన్నార‌ట‌.

సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాలీవుడ్ మూవీ `ముంబై సాగా` 90 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పెండింగ్ షూట్ కోసం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీనే బెస్ట్ అనుకున్నార‌ట‌. 12 రోజుల పాటు షూటింగ్ ఇక్క‌డే చేయ‌నున్నారు. దీనికోసం రెండు సెట్లు వేస్తున్నార‌ట‌. నెలాఖ‌రు లేదా జూలై నాటికి హీరోలు జాన్ అబ్ర‌హాం.. ఇమ్రాన్ హ‌స్మీ సెట్స్ కు చేరుకుంటారు. చిత్రీక‌ర‌ణ సాగిస్తార‌ట‌. ఇదే గ్యాప్ త‌ర‌వాత‌ ఆర్.ఎఫ్‌.సీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న తొలి హిందీ సినిమా. ముంబై లో అనుమ‌తులు ఉన్నా ఈ క్రైసిస్ వేళ‌ ఇక్క‌డ అయితేనే బెట‌ర్ అనుకుని ప్లాన్ మార్చారు. అలాగే ప‌లు తెలుగు చిత్రాల‌కు సెట్స్ వేసి ఆర్.ఎఫ్‌.సీ లో షూట్ చేస్తున్నారు. పొరుగు భాష‌ల చిత్రాల‌కు సంబంధించిన షెడ్యూల్స్ ఇక్క‌డ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. మొత్తానికి మెట్రో న‌గ‌రాల్లో విల‌యం ఆర్.ఎఫ్‌.సి కి అలా క‌లిసొస్తోంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News