స్టార్ హీరోయిన్ను నీ పేరేంట‌ని అడిగాడు..ఆ త‌ర్వాత ఏమైంది?

Update: 2021-09-04 11:30 GMT
ఈ రోజుల్లో ఒక‌టీ రెండు సినిమాల్లో న‌టించిన వారే తమ గురించి ఎంతో ఊహించుకుంటారు. మీడియా అటెన్ష‌న్, క్లిక్ మ‌నే కెమెరాలు, సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్.. ఇదంతా చూసుకుని తామంటే గుర్తుప‌ట్ట‌ని వాళ్లు ఉండ‌ర‌నే భ్ర‌మ‌ల్లోకి వెళ్లిపోతారు. అయితే వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. వీట‌న్నింటికీ దూరంగా ఇంకో ప్ర‌పంచం ఉంటుంది. వీటితో సంబంధం లేకుండా అనేక మంది వ్య‌క్తులు వారు. ఆ వ్య‌క్తుల‌కు వీరెవ‌రో తెలీదు. హ‌ఠాత్తుగా ఈ సెల‌బ్రిటీలు వారి ముందు ప్ర‌త్య‌క్షం అయినా, వారు ఆశ్చ‌ర్య‌పోవ‌డం మాట అటుంచి, వీరెవ‌రో తెలియ‌ని ప‌రిస్థితులు కూడా ఉంటాయి. ఇదేమీ మ‌రీ విడ్డూర‌మైన‌ది కాదు. స‌రిగ్గా ఇదే అనుభ‌వ‌మే ఎదురైంది న‌టి సారా అలీఖాన్ కు, అది ఎయిర్ పోర్టులో.

సారా అలీఖాన్ ఎవ‌రో, ఆమెకున్న క్రేజ్ ఏమిటో వేరే ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తాత పెద్ద క్రికెట‌ర్, తండ్రి బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు, త‌ల్లి కూడా ఒక‌ప్ప‌టి హీరోయిన్, నాయ‌న‌మ్మ కూడా ఒక‌ప్ప‌టి గొప్ప న‌టి. వీట‌న్నింటికీ తోడు.. సొంతంగా కూడా ఇమేజ్ సంపాదించుకుంది. ప‌టౌడీల వార‌సురాలిగా, అంద‌గ‌త్తెగా, గ్లామ‌ర‌స్ భామగా.. ప‌రిప‌రి విధాలు ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె గురించి సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిని అడిగితే బోలెడ‌న్ని విష‌యాలు చెబుతారు. అయితే.. వీటితో సంబంధం లేని వారికి మాత్రం ఈమె ఎవ‌రో తెలియ‌క‌పోవ‌చ్చు.

అలాంటి వ్య‌క్తే సారాకు ఎదుర‌య్యాడు. అయితే ఈమె క‌ట్టూబొట్టూ చూసి, ఈమెను ఎక్క‌డో చూసిన‌ట్టుగా అనిపించింది! అంతే..  లేట్ చేయ‌కుండా..* నీ పేరేంటి?* అంటూ అడిగాడు ఆ వ్య‌క్తి. వ‌య‌సు యాభై వ‌ర‌కూ ఉండొచ్చు. మామూలుగా అయితే ఇది సెల‌బ్రిటీల‌కు ఇగోను హ‌ర్ట్ చేసే అంశ‌మే. నేనెవ‌రో తెలియ‌దా, నేనే తెలియ‌దా.. అన్న‌ట్టుగా వారు అక్క‌డ రియాక్ష‌న్ ఇచ్చినా, త‌న పేరు చెప్పుకుని ప‌రిచ‌యం చేసుకునేదేంటి అంటూ అక్క‌డ నుంచి వెళ్లిపోయినా అడిగే వారుండ‌రు. అయితే సారా మాత్రం అలాంటి అహంకారాలేవీ చూప‌లేదు. సింపుల్ గా త‌న పేరు చెప్పింది. *సారా* అంటూ న‌వ్వుతూ ఆయ‌న‌కు వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది సారా అలీఖాన్.

ఇలాంటి చిన్న చిన్న అంశాలే సెల‌బ్రిటీల విలువ‌ను పెంచేది. ఆ స‌మ‌యంలో సారా మ‌రో మూడ్ లో ఉన్నా, ఏమాత్రం అహంభావాన్ని వ్య‌క్తీక‌రించి ఉన్నా.. అది మీడియా కంట ప‌డి ఉంటే.. ర‌చ్చ‌ర‌చ్చ అయ్యేది. అయితే సారా మాత్రం.. విధేయంగా స్పందించి అంద‌రి హృద‌యాల‌నూ గెలుస్తూ ఉంది. ఇదే కాదు.. ఇది వ‌ర‌కూ కూడా సారా చాలా సార్లు హంబుల్ గా బిహేవ్ చేసింది. త‌ను గుళ్ల‌కు వెళ్లిన‌ప్పుడు కెమెరామెన్లు వెంట‌ప‌డి క్లిక్ మ‌నిపిస్తున్న‌ప్పుడు, 'భ‌య్యా..ఇది గుడి..' అంటూ వారికి గుర్తుచేస్తూ ఉంటుంది. ఈ తీరు అమృతాసింగ్ పెంప‌కానికి అభినంద‌న‌లు అందేలా చేస్తూ ఉంది.
Tags:    

Similar News