చిరు.. రోజా కలిసి అదరగొట్టేశారు

Update: 2017-04-27 06:13 GMT
మెగాస్టార్ చిరంజీవి.. రోజా ఇద్దరి పేర్లూ ఒకేసారి తలుచుకోగానే ‘ముఠామేస్త్రి’.. ‘బిగ్ బాస్’ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ‘ముఠామేస్త్రి’ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎంత బాగా పండిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కాల క్రమంలో పరిస్థితులు మారాయి. ఒకప్పటి ఈ హీరో.. ఆ హీరోయిన్ కాల క్రమంలో రాజకీయ శత్రువులుగా మారారు. ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. ముఖ్యంగా రోజా అయితే.. రాజకీయాల్లో చిరు పేరెత్తితే ఇంతెత్తున లేస్తుంది. ఆయన్ని ఎన్నోసార్లు దునుమాడేసింది.

ఐతే అలాంటి రోజా ఇటీవలే సాక్షి టీవీ తరఫున చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తూ ఆయనతో చాలా సాత్వికంగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కథ అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు చిరంజీవి నిర్వహించే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి రోజా అతిథిగా హాజరైంది. ఇక్కడ వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజిలో పండినట్లే కనిపిస్తోంది.

‘ఎంఈకే’ హాట్ సీట్లోకి వచ్చిన సందర్భంగా రోజా హోస్ట్ చిరంజీవితో కలిసి ఒకప్పటి హిట్ పాటలకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఇక చిరు గురించి చెప్పేదేముంది? తనదైన శైలిలో చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి కామెడీ కూడా ఓ రేంజిలో పండించారు. తర్వాత రోజా.. మీతో మళ్లీ నటించే ఛాన్స్ ఎప్పుడని అడగ్గా.. తప్పకుండా కుదిరితే కలిసి నటిద్దాం అన్నాడు చిరు. మరి నాని అడగ్గానే సైకిల్ కొనిచ్చినట్లుగా.. రోజా అడిగిన అవకాశాన్ని చిరు ఇస్తాడేమో.. ఈ హిట్ జోడీని మళ్లీ కలిసి తెరమీద చూస్తామేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News