ఘాజీ.. అసలెందుకీ టైటిల్?

Update: 2017-02-20 12:27 GMT
ఒక సినిమాకు టైటిల్ గా సాధ్యమైనంత వరకు హీరో పేరునే టైటిల్ గా పెట్టడానికి చూస్తారు. కానీ ఎప్పుడైనా విలన్ పేరును టైటిల్‌ గా పెట్టడం చూశారా..? ‘ఘాజీ’ టైటిల్ అలాంటిదే మరి. ‘ఘాజీ’ అన్నది పాకిస్థాన్ సబ్ మెరైన్ పేరు. దాన్ని ఇండియన్ నేవీ ఎలా ధ్వంసం చేసిందన్నదే ఈ సినిమా కథ. ఇలా శత్రువు సబ్ మెరైన్ పేరును సినిమాకు టైటిల్‌ గా పెట్టడం చిత్రమైన విషయమే. ఐతే అన్నీ ఆలోచించాకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామంటున్నాడు రానా దగ్గుబాటి. ‘ఘాజీ’ టైటిల్ వెనుక స్టోరీ ఏంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ఈ సినిమా మొదలుపెట్టినపుడు ఏం టైటిల్ పెట్టాలో అర్థం కాలేదు. రకరకాలుగా ఆలోచించాం. చివరికి ‘ఘాజీ’ అని ఫిక్సయ్యాం. అలా ఫిక్సవడానికి కారణముంది. మామూలుగా సబ్ మెరైన్ గురించి.. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధానికి ముందు నేపథ్యం గురించి జనాలకు తెలియదు. విశాఖపట్నంలో ఈ కథ జరిగినా అక్కడి వాళ్లకు కూడా దీని గురించి తెలియదు. ఈ సినిమా కథ మీద పరిశోధనలో భాగంగా చరిత్రను తిరగేస్తే ‘ఐఎన్ ఎస్ ఘాజీ’ అనే ప్రస్తావనే ఉంది. నేను చదువుకునేటపుడు పుస్తకంలో కూడా ఈ పేరు చదివిన జ్నాపకముంది. అందుకే జనాలకు అంతో ఇంతో పరిచయమున్నది ‘ఘాజీ’ అనే మాటే కాబట్టి.. కనీసం నేవీ వాళ్లు.. నాటి సంఘటన మీద అవగాహన ఉన్న వాళ్లయినా ఈ సినిమాతో కనెక్టవుతారనే ఉద్దేశంతో ‘ఘాజీ’ అనే టైటిలే పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఐతే విశాఖపట్నంలో ఒకతను వచ్చి మీరు తీస్తున్న ‘షూజీ’ అనే సినిమా ఎంత వరకు వచ్చింది అన్నపుడు కంగారు మొదలైంది. ఘాజీ గురించి జనాలకు ఏమీ తెలియదా అనిపించింది’’ అని రానా అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News