ఎన్టీఆర్ సువర్ణ హస్తాలతో లిఖించబడిన 'వైజయంతీ'..!

Update: 2020-04-29 07:30 GMT
భారతీయ చిత్ర పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటని చెప్పవచ్చు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు అగ్ర నిర్మాత చలసాని అశ్వినీద‌త్. నందమూరి తారక రామారావు హీరోగా నటించిన ‘ఎదురులేని మనిషి’ సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం ఐదు దశాబ్దాలుగా సుధీర్ఘంగా సాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోన్న ఎందరో సినీ వారసులను పరిచయం చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. ఈ మధ్య 'మహానటి' 'దేవదాస్' 'మహర్షి' వంటి మంచి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ త్వ‌ర‌లో ప్ర‌భాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని త‌ల‌పెట్టి మ‌రో మెట్టు ఎక్క‌బోతోంది. వైజ‌యంతీ మూవీస్ ఈ ప్ర‌యాణంలోని మ‌ధుర స్మృతుల్ని నెమ‌రువేసుకునే ప‌నిలో ప‌డింది. ఆనాటి విశేషాల్ని సోష‌ల్ మీడియా ద్వారా సినీ అభిమానుల‌తో పంచుకుంటామ‌ని ఈ మ‌ధ్య ప్ర‌క‌టించిన వైజ‌యంతీ సంస్థ.. ఇప్పుడు ఆ ప‌రంప‌ర‌లో మొద‌టి జ్ఞాప‌కం బ‌య‌ట‌కు వదిలింది. ద‌గ్గుబాటి రానా వాయిస్‌ తో ఈ వీడియో రూపొంద‌డం విశేషం. ఈ వీడియోలో వైజయంతి మూవీస్ సంస్థ‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆ పేరు ఎవ‌రు పెట్టారు.. ఆ ప్రయాణానికి ఒక చారిత్రాత్మిక నాంది ఎలా పడింది అనే విష‌యాల్ని తెలియజేసారు.

ఈ వీడియోలో దగ్గుబాటి రానా.. 'గత ఐదు దశాబ్దాలుగా ప్రతీ జనరేషన్‌ కు తగ్గట్టు బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తోన్న సంస్థ వైజయంతీ మూవీస్. కానీ ఈ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసా.. 1974లో చలసాని అశ్వనీదత్ 21 ఏళ్ల వయసులో కె.విశ్వనాథ్ గారి ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. పట్టు వదలని విక్రమార్కుడిలా.. మొండితనమో పట్టుదలో కానీ చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్‌ మెంట్ సాధించారు. తనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి.. అతని మాటలకు ముచ్చటేసి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది.. బ్యానర్ ఏమిటి అని. విజయ సంస్థ లాంటిది అయితే బాగుండు అని దత్ గారి మనసులో ఉంది. ఆ మహనీయుడు ఎన్టీఆర్ అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటోను చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం మరిమళాలను వెదజల్లుతూ ఎన్నటీ వాడిపోని ‘వైజయంతి’.. అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణం తన సువర్ణ హస్తాలతో వైజయంతీ మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’. ఆ తారక రాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు.. ఏ వేళా విశేషమో ఆ మహానుభావుడి హస్తవాసో.. ఆనాటి నుంచి వైజయంతీ మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది' అంటూ వివరించారు.


Full View

Tags:    

Similar News