టాలీవుడ్ అంతా దైవమయం!
భక్తి ప్లస్ ఫాంటసీ అన్నది బాక్సాఫీస్ సక్సెస్ గా మారిపోయింది.;
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ బలమైన ట్రెండ్ నడుస్తోంది. సినిమాల్లో కేవలం దేవుడి ప్రస్తావన మాత్రమే కాకుండా, దేవుడే కథను నడిపించే ప్రధాన శక్తిగా లేదా కథలో ఒక కీలక పాత్రగా మారుతున్నాడు అన్నది కాదనలేని నిజం. ఆ తరహా కాన్సెప్ట్ లు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో మంచి విజయాలు సాధిస్తున్నాయి. భక్తి ప్లస్ ఫాంటసీ అన్నది బాక్సాఫీస్ సక్సెస్ గా మారిపోయింది. `కార్తికేయ2` లో కృష్ణతత్వాన్ని ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టారు. `హను-మాన్` లో ఒక సామాన్యుడికి హనుమంతుడి శక్తి లభిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
`కల్కి 2898 ఏడీ` మహాభారత కాలం నాటి అశ్వత్థామ పాత్రను భవిష్యత్తు కథతో కలిపి చూపించడం ఒక విప్లవం. ఇందులో కృష్ణ పరమాత్మ పాత్రతో కథను నడిపించే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అప్ కమింగ్ చిత్రాలు కూడా ఇదే తరహాలో దేవుడు కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `వారణాసి` లో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. శివుడి పాత్రకు సంబంధించిన మూలాలు కూడా కథలో హైలైట్ అవుతున్నాయి. ఎద్దుపై మహేష్ స్వారీ చేస్తోన్న సన్నివేశం హైలైట్ గా నిలుస్తోంది. `నాగబంధం` కూడా శివుడి కాన్సెప్ట్ ఆధారంగానే తెరకెక్కుతోంది.
సినిమాలో ఆద్యంతం శివుడి పాత్ర హైలైట్ కానుంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ `మహాభారతం`ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రైటింగ్ పనులు మొదలయ్యాయి. బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ప్లాన్ చేస్తున్నారు. అగ్ర నిర్మాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు మహాభారతాన్ని తెరకెక్కిస్తారా? అని ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలాగే దర్శకుడు చందు మొండేటి `వాయుపుత్ర` చిత్రాన్ని 3 డీ యానిమేషన్ లో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు నుంచి ఇంత వరకూ యానిమేషన్ అంటూ ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలో `వాయుపుత్ర` కాన్సెప్ట్ ను చందు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. చందు ఐడియాలజీ వర్కౌట్ అయితే మరిన్ని దేవుడు కాన్సెప్ట్ లు యానిమేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంది. అలాగే హోంబలే ఫిల్మ్స్ `నరసింహ అవతార్` ను ఓ యూనివర్శ్ లో క్రియేట్ చేసి మరిన్ని దేవుడు కాన్సెప్ట్ లను 3డీ యానిమేషన్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
త్రివిక్రమ్ `కార్తికేయ` స్వామి నేపథ్యంలో మైథలాజికల్ స్క్రిప్ట్ ని సిద్దం చేసి పెట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న `వృశకర్మ`లోనూ దేవుడున్నాడు. బాలీవుడ్ లో `రామాయణం` ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోందో తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రంలో సంపూర్ణ రామాయణం హైలైట్ కానుంది.