టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్.. అన్యాయంగా నిర్బంధించారంటూ వీడియో రిలీజ్!
నీట్ పరీక్షల్లో జరిగిన స్కాం కారణంగా కొంతమంది విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీలో నిరసన సెగ మొదలైంది.
నీట్ పరీక్షల్లో జరిగిన స్కాం కారణంగా కొంతమంది విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీలో నిరసన సెగ మొదలైంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేసిన సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో చేపట్టిన ఈ నిరసన సెగ కేరళ కొచ్చితోపాటు హైదరాబాదుకి కూడా తగిలింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విద్యార్థులకు మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కొచ్చిలో ప్రియా ప్రకాష్ వారియర్, గౌరీ జి కిషన్ వంటి తారలతోపాటు జోజు జార్జ్, ఆశిక్ వంటి సెలబ్రిటీలు కూడా పోస్టర్లు పట్టుకొని నిరసనలు తెలియపరచిన విషయం తెలిసిందే. ఇటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
ఓం భీమ్ బుష్ నటి అరెస్ట్..
జూలై 22వ తేదీన విద్యార్థులకు మద్దతుగా ముంబైలో శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో 'ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఇటీవల ధురంధర్ సినిమాలో "షరారత్" పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆయేషా ఖాన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటన గురించి ఆయేషా ఖాన్ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నప్పుడు ఒక వీడియో, పోలీస్ స్టేషన్ నుండి మరొక వీడియో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్యాయంగా అరెస్టు చేశారంటూ నటి ఆవేదన..
విద్యార్థులకు అండగా కేవలం రోడ్డు మీద ప్రశాంతంగా నిలబడినందుకు పోలీసులు నన్ను అరెస్టు చేసి వ్యాన్ లో నిర్బంధించారు. నీట్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు నేను, నా సోదరుడు, కొందరు స్నేహితులతో కలిసి దాదర్ కి చేరుకున్నాము. ఆ ప్రదేశంలో నిరసనలకు అనుమతి లేదని నాతోపాటు మిగిలిన వారిని వోర్లీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం మీతో మాట్లాడుతుంటే నాకు చేతులు వణికిపోతున్నాయి. అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ కూడా బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?" అంటూ ఆమె ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం ఆయేషా ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆయేషా ఖాన్ సినిమాలు..
ఆయేషా ఖాన్ విషయానికి వస్తే.. 2022లో ప్రముఖ డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వం వహించిన ముఖచిత్రం ద్వారా తన కెరీర్ను మొదలుపెట్టింది. ఇందులో విశ్వక్ సేన్ అతిథి పాత్ర పోషించగా.. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని , చైతన్యరావ్ మదాది కీలక పాత్రలు పోషించారు. ఇక ఆ తర్వాత శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన తెలుగు హారర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ సినిమాలో కూడా నటించింది. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రాల తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమె ఇటీవల రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో సారా అర్జున్ హీరోయిన్గా వచ్చిన ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.