మూవీ రివ్యూ : జననాయకుడు

తమిళనాట కొత్త రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు చివరగా నటించిన చిత్రం.. జననాయగన్.

Update: 2026-07-23 08:36 GMT

‘జననాయకుడు’ మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్- మామిత బైజు- పూజా హెగ్డే- బాబీ డియోల్- ప్రకాష్ రాజ్- ప్రియమణి- నాజర్- సునీల్ తదితరులు

సంగీతం: అనిరుధ్

ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్

మాటలు: హనుమాన్ చౌదరి

నిర్మాత: వెంకట్.కె.నారాయణ

రచన-దర్శకత్వం: హెచ్.వినోద్

తమిళనాట కొత్త రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు చివరగా నటించిన చిత్రం.. జననాయగన్. సెన్సార్ సమస్యల కారణంగా ఆలస్యమై ఎట్టకేలకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వెట్రి (విజయ్) ఒక హత్య కేసులో జైల్లో ఖైదీగా ఉంటాడు. అక్కడ తన మీద అభిమానం చూపించిన జైలర్ మీద అతడికి ఎంతో గౌరవం ఉంటుంది. వెట్రి బయటికి వచ్చే సమయానికి ఆ జైలర్ అనుకోకుండా చనిపోవడంతో ఆయన కూతురు విజ్జి (మామిత బైజు) బాధ్యతను తాను తీసుకుంటాడు. ఒక మానసిక సమస్యతో బాధ పడుతున్న విజ్జిని తన తండ్రి కోరిక మేరకు ఎలాగైనా సైనికురాలిని చేయాలని వెట్రి లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ విజ్జికి అదిష్టం లేకపోయినా వెట్రి కోసం కష్టపడుతుంటుంది. ఇంతలో విజ్జి ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) అనే ఇంటర్నేషనల్ డాన్ వల్ల ఆమెకు ప్రాణాపాయం ఉందని తెలిశాక వెట్రి అతణ్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ జాన్ హిమ్లర్ ఎవరు.. తన వల్ల విజ్జికి ఎందుకు ప్రాణాపాయం తలెత్తింది... పూర్వాశ్రమంలో వెట్రి ఎవరు.. జాన్ తో తన పోరాటం ఎంత వరకు వెళ్లింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

రీమేక్ సినిమాలనగానే జనాల్లో ఒక నిరాసక్తత వచ్చేసిన రోజులివి. ఏదైనా విదేశీ భాష నుంచి ఓ సినిమాను ఫ్రీమేక్ చేసినా.. చిన్న ప్రోమో చూసి నిమిషాల్లో దాని బండారం బయటపెట్టేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని రీమేక్ అయినా.. ఫ్రీమేక్ అయినా.. ఆ సినిమా విశేషాలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. అలాంటపుడు సినిమా చూడాలన్న ఆసక్తి ఏముంటుంది? ఇలాంటి టైంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు తమిళ టాప్ స్టార్ విజయ్ తన చివరి సినిమాగా చేసిన ‘జననాయకుడు’ కోసం తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ మీద ఆధారపడ్డారు. ఐతే ఉన్నదున్నట్లు తీస్తే ఈ రోజుల్లో కష్టం కదా.. అందుకే మన హరీష్ శంకర్ స్టయిల్లో రీమేక్ కాని రీమేక్ గా తీర్చిదిద్దారు ఈ చిత్రాన్ని. విలన్ ట్రాక్ మొత్తాన్ని మార్చేయడమే కాక.. దళపతి రాజకీయాలకు ఉపయోగపడేలా పొలిటికల్ కలర్ కూడా జోడించారు. కానీ ఆ వ్యవహారమంతా ‘కేసరి’ కథలో పూర్తిగా ఇమడలేదు. ‘భగవంత్ కేసరి’ కథను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు.

యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ల స్పై సినిమాలను గమనిస్తే.. విలన్ పాత్రలన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. నిజాయితీగా పని చేసినా సరే వ్యవస్థ వల్ల దెబ్బ తిన్న ఒక అధికారి.. సంఘ వ్యతిరేక శక్తిగా మారి దేశాన్నే దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగా శత్రు దేశంతో చేతులు కలుపుతుంటాడు. ‘భగవంత్ కేసరి’ నుంచి భిన్నంగా నిలబెట్టడానికి అలాంటి పాత్రనే క్రియేట్ చేశాడు హెచ్.వినోద్ ‘జననాయకుడు’లో. ‘యానిమల్’తో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించిన బాబీ డియోల్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నారు. ఒక అటవీ ప్రాంతంలో పని చేసే పోలీస్ అధికారి.. ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా మారే బ్యాక్‌డ్రాప్‌ను చూపించారు. విలన్ ట్రాక్‌ను భారీ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ‘భగవంత్ కేసరి’ కథలో ఈ ట్రాక్‌ను జోడించడం ద్వారా కొత్త ట్రీట్‌మెంట్ ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఇదంతా ఒకెత్తయితే.. విజయ్ రాజకీయ ప్రయోజనం కోసం పెట్టిన సీన్లు-డైలాగులు మరో ఎత్తు. దళపతితో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల తమిళ ప్రేక్షకులకు అవి గూస్ బంప్స్ ఇస్తాయేమో కానీ.. మన ప్రేక్షకులకు మాత్రం అవి కథలో భాగంగా మరింత సహజంగా వచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

‘భగవంత్ కేసరి’కి చేసిన మార్పులు చేర్పులతో కథ కొత్త రూపాన్ని సంతరించుకుంది. కూతురు-పెంచిన తండ్రి మధ్య ఎమోషనల్ బాండింగ్‌కు ఇంకాస్త సమయం కేటాయించి ఉంటే బాగుండేది. విజయ్ పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడంతో ఆ ఎమోషన్ కొంత తగ్గింది. కేవలం ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఎపిసోడ్లను మాత్రం మాస్ ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దారు. విజయ్ అభిమానులు కూడా వీటితో కనెక్ట్ అవుతారు. విజయ్ పొలిటికల్ ఐడియాలజీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా సినిమాలో కనిపిస్తుంది. మూల కథను ‘భగవంత్ కేసరి’ నుంచే తీసుకున్నా.. దానికి భిన్నమైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ మార్పులు తమిళ ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తాయో చూడాలి. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ వెర్షన్‌తో కనెక్ట్ కావడం కొంత కష్టమే.

నటీనటులు:

విజయ్ నటన కంటే.. తన ట్రేడ్ మార్కు మేనరిజమ్స్.. స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఎలివేషన్ సీన్లలో బాగా హైలైట్ అయ్యాడు. యాక్షన్ ఘట్టాల్లోనూ ఆకట్టుకున్నాడు. తన లుక్ బాగుంది. పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో ఏమీ లేదు. విజ్జి పాత్రలో మామిత బైజు జస్ట్ ఓకే అనిపిస్తుంది. తన పాత్రకు మొదట్లో బాగానే ప్రాధాన్యం కనిపిస్తుంది కానీ.. తర్వాత సైడ్ అయిపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ అనే ఫీలింగ్ ఎంతమాత్రం అనిపించదు. తన పాత్రను సైడ్ క్యారెక్టర్లా మార్చేశారు. బాబీ డియోల్ చేసిన విలన్ పాత్ర కామెడీగా తయారైంది. అసలీ కథలో ఇలాంటి పాత్రను పెట్టాలని ఎలా అనిపించిందో అర్థం కాదు. డబ్బింగ్ వాయిస్ వల్ల ప్రకాష్ రాజ్ పాత్రతో ఏ కోశానా కనెక్ట్ కాలేం. నాజర్.. ప్రియమణి.. సునీల్.. ఇలా చాలామంది పేరున్న నటీనటులున్నా ఎవరికీ సరైన పాత్ర పడలేదు.

సాంకేతిక వర్గం:

‘జననాయకుడు’ కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాగానే డ్యూటీ చేశాడు. బీజీఎం విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాల్లో మోత మోగించాడు. పాటల పరంగా మాత్రం అతను నిరాశపరిచాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువకు ఢోకా లేదు. ఇక దర్శకుడు హెచ్.వినోద్ ఫిల్మోగ్రఫీలో ‘జననాయకుడు’ అట్టడుగున నిలుస్తుందనడంలో సందేహం లేదు. ‘భగవంత్ కేసరి’ లాంటి మంచి కథను అతను కంగాళీగా చేసి పెట్టాడు. ఐతే ఇందుకు పూర్తిగా అతణ్నే నిందించలేం. విజయ్ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా కథను మార్చాల్సిన పరిస్థితుల్లో అతడి క్రియేటివిటీ ఎందుకూ కొరగాకుండా పోయింది. పొలిటికల్ లీడర్ గా విజయ్ ని ప్రొజెక్ట్ చేయడానికి పెట్టిన సీన్లు.. డైలాగుల విషయంలో అతణ్ని తప్పుబట్టలేం కానీ.. విలన్ ట్రాక్ ను మలిచిన విధానంలో మాత్రం వినోద్ కు పూర్తిగా మైనస్ మార్కులే పడతాయి.

చివరగా: జననాయకుడు.. యాక్షన్ బాగున్నా..కథనం మెప్పించలేదు

రేటింగ్: 2.25/5

Tags:    

Similar News