స్టార్ హీరోని చీట్ చేయలేరు.. 'కామోష్' ఆగడాలకు కోర్టులో చెక్
పర్సనాలిటీ రైట్స్ ద్వారా శత్రుఘ్న సిన్హాకు లభించిన హక్కుల వివరాల్లోకి వెళితే.. ఆయన పేరును ఆయన అనుమతి లేకుండా ప్రమోషన్ల కోసం వాడలేరు.;
బాలీవుడ్ లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా తన `పర్సనాలిటీ రైట్స్` పరిరక్షణలో బాంబే హైకోర్టులో ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించారు. శత్రుఘ్న సిన్హా అనుమతి లేకుండా ఆయన పేరు, స్వరం, ముఖం లేదా ఆయనకు గుర్తింపు తెచ్చిన శైలిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి ఆయనను అనుకరిస్తే జైలు తప్పదని హెచ్చరించింది.
కామోష్ డైలాగ్ ఇంకెవరూ కాపీ చేయలేరు..
శత్రుఘ్న సిన్హా అంటేనే గుర్తుకు వచ్చే ప్రసిద్ధ డైలాగ్ `కామోష్!`. ఇప్పుడు ఈ డైలాగ్ ఆయన పర్సనాలిటీ రైట్స్‌లో భాగం. ఎవరైనా సరే ఏఐ ద్వారా ఆయన గొంతును సృష్టించి ఈ డైలాగ్ చెప్పించడం లేదా ఆయన ట్రేడ్‌మార్క్ స్టైల్‌ను వాడుకోవడం చట్టవిరుద్ధం. మీమ్‌లు, డీప్‌ఫేక్ వీడియోలు లేదా యాడ్స్ ద్వారా ఆయన ఇమేజ్‌ని దెబ్బతీసే ప్రయత్నాలను కోర్టు తీర్పు అడ్డుకుంటుంది.
పర్సనాలిటీ రైట్స్ ద్వారా శత్రుఘ్న సిన్హాకు లభించిన హక్కుల వివరాల్లోకి వెళితే.. ఆయన పేరును ఆయన అనుమతి లేకుండా ప్రమోషన్ల కోసం వాడలేరు. ఏఐ ద్వారా ఆయన గొంతును రీక్రియేట్ చేయడంపై నిషేధం ఉంది. ఆయన ఫోటోలు, డ్రాయింగ్స్, క్యారికేచర్లు లేదా కార్టూన్లను వాణిజ్య ప్రకటనల్లో వాడకూడదు. స్టైల్ అండ్ మానరిజమ్స్ అనుకరిస్తే కుదరదు. ఆయన ప్రత్యేకమైన నడక, నటన శైలి లేదా సంతకాన్ని ఇతరులు వాడుకోలేరు.
ఇటీవల ఏఐ సాంకేతికత పెరిగిన తర్వాత సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి గొంతులతో తప్పుడు వీడియోలు లేదా ప్రకటనలు సృష్టిస్తున్నారు. దీనివల్ల వారి ప్రతిష్ఠకు భంగం కలగడమే కాకుండా, వారి ఆర్థిక ప్రయోజనాలు కూడా దెబ్బతింటున్నాయి. శత్రుఘ్న సిన్హా కంటే ముందు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, అనిల్ కపూర్ కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు.
కోర్టు తీర్పు ప్రకారం, ఎవరైనా సరే శత్రుఘ్న సిన్హాకు గుర్తింపునిచ్చే ఏ అంశాన్నైనా వాడాలనుకుంటే, ముందుగా ఆయన నుండి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. ఏఐ టెక్నాలజీతో సెలబ్రిటీల ప్రైవసీని కాపాడడంలో ఇదొక మైలురాయి లాంటి తీర్పు. మొత్తానికి శత్రుఘ్న సిన్హా తన `కామోష్` పవర్‌తో ఏఐ ఆగడాలకు కోర్టు వేదికగా చెక్ పెట్టారన్నమాట!