నిధి అగర్వాల్.. మళ్లీ శివాజీకి కౌంటరా?
మహిళల దుస్తులు కారణంగా చూపించడం సరైనది కాదని పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు.;
హీరోయిన్ల డ్రెస్సింగ్ పై సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో మళ్లీ పెద్ద చర్చకు దారి తీశాయి. ఆ వ్యాఖ్యలకు పరోక్షంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో శివాజీ పేరు ఎత్తకుండా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టగా.. ఇప్పుడు పబ్లిక్ అప్పియరెన్స్ తో మళ్లీ కౌంటర్ ఇచ్చారని అంతా అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగిందంటే..
ఇటీవల జరిగిన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లేటప్పుడు కాస్త ట్రెడిషనల్ గా డ్రెస్సులు ధరించాలని సూచించారు. కొన్నిసార్లు అభ్యంతరకరమైన డ్రెస్సింగ్ వల్ల అభిమానులు అత్యుత్సాహంగా ప్రవర్తించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
మహిళల దుస్తులు కారణంగా చూపించడం సరైనది కాదని పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలు పెరగడంతో శివాజీ తర్వాత తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలని చెప్పారు. ఆ సందర్భంగా గతంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు జరిగిన అసౌకర్యకర అనుభవాలు తనను కలచివేశాయని తెలిపారు.
అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పానని వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లోని లులు మాల్ లో నిధి ఎదుర్కొన్న ఘటనను కూడా గుర్తు చేశారు. అలాగే హీరోయిన్ సమంతకు ఈవెంట్లలో ఎదురైన ఇబ్బందులు ప్రస్తావించారు. అయితే ఆ వ్యాఖ్యల తర్వాత నిధి అగర్వాల్ తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. బాధితురాలినే నిందించడం సానుభూతి కాదని, అలాంటి వ్యాఖ్యలు తప్పుదోవ పట్టిస్తాయంటూ స్టోరీ పెట్టారు.
ఎవరినీ నేరుగా ఉద్దేశించకపోయినా, ఆ పోస్ట్ శివాజీ కామెంట్స్ కు కౌంటర్ గా భావిస్తూ నెటిజన్లు చర్చించుకున్నారు. అదే సమయంలో రీసెంట్ గా నిధి ఒక ఈవెంట్ కు స్టైలిష్ మోడ్రన్ డ్రెస్ లో హాజరైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో డ్రెస్సింగ్ తోనే తన సమాధానంగా చూపించిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలో వారి వ్యక్తిగత ఎంపిక అని, దానిని తప్పుబట్టడం సరైంది కాదని పలువురు మద్దతు తెలుపుతున్నారు.
ఏదేమైనా శివాజీ మాత్రం తన ఉద్దేశం ఎవరినీ తప్పుబట్టడం కాదని, ఈవెంట్లలో ఎలాంటి ఘటనలు జరగకూడదనే చెప్పానని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఆ అంశం మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది. మహిళల సెక్యూరిటీ, వ్యక్తిగత స్వేచ్ఛ, డ్రెస్సింగ్ లపై ఇండస్ట్రీతో పాటు సమాజంలోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నిధి డ్రెస్సింగ్ తో వివాదం కొత్త మలుపు తిరిగింది. అయితే ఇప్పుడు శివాజీ నుంచి మరిన్ని క్లారిటీ స్టేట్మెంట్స్ వస్తాయా? లేక ఇక్కడితో చర్చ ముగుస్తుందా? అన్నది చూడాలి.