రవితేజ తో సినిమా ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్..?
ఇటీవల టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన మలయాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'. పృథ్వీరాజ్ - సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా.. రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏడాది క్రితమే న్యూస్ వచ్చింది. ఈ సినిమాపై ముచ్చటపడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా రీమేక్ రైట్స్ తీసుకున్నారని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా ఓ హీరో మరియు అతన్ని అభిమానించే ఓ బ్రేక్ ఇన్ స్పెక్టర్ మధ్య అనుకోని పరిస్థితుల వల్ల ఏర్పడిన గొడవ నేపథ్యంలో రూపొందింది. తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించనున్నారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రవితేజ ను ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారని అంటున్నారు.
పృథ్వీరాజ్ పోషించిన స్టార్ హీరో పాత్రను తెలుగులో రవితేజ తో చేయించాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే, నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ కావడంతో మాస్ రాజాకి మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో రవితేజ చేసిన మలయాళ రీమేక్ 'నా ఆటోగ్రాఫ్' నిరాశపరిచింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఇకపోతే సూరజ్ పోషించిన బ్రేక్ ఇన్ స్పెక్టర్ పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించనున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఫైనల్ గా చరణ్ ఎవరెవరికి లైసెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.