తన నత్తి గురించి రాజశేఖర్..

Update: 2017-11-23 23:30 GMT
సీనియర్ హీరో రాజశేఖర్ కు మాట తడబడుతుందన్న విషయం తెలిసిందే. ఐతే తనకు నత్తి ఉందని.. అందులో తాను సిగ్గుపడేది ఏమీ లేదని ఈ మధ్యే స్వయంగా రాజశేఖరే వ్యాఖ్యానించాడు. అందరూ తాను తమిళవాడిని కాబట్టి తెలుగు సరిగా రాక తడబడుతుంటానని అనుకుంటారని.. కానీ నిజానికి తనకు నత్తి అని.. తాను తెలుగువాడినే అని రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. నత్తి వల్ల తాను కెరీర్ ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు పడిందీ ఆయన వివరించాడు.

తాను పక్కా తెలుగువాడినే అని.. కానీ తన కుటుంబం తమిళనాడులో స్థిరపడిందని రాజశేఖర్ వెల్లడించాడు. తన తండ్రి పోలీసాఫీసర్ అని.. ఆయన తమిళనాడులో పని చేశారని.. అనేక ఊర్లు తిరిగారని చెప్పాడు. తాను ఉన్న ఊళ్లలో తమిళం మీడియం తప్ప ఇంకేం ఉండేది కాదని.. ఇంగ్లిష్ మీడియంకు కూడా అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమిళంలో చదువుకున్నానని.. దీంతో తెలుగు సరిగా రాలేదని.. తెలుగు చదవడం కూడా తనకు రాదని రాజశేఖర్ వెల్లడించాడు. తాను తెలుగు సినిమాల్లోకి వచ్చినపుడు తెలుగు సరిగా మాట్లాడలేకపోవడం.. పైగా నత్తి ఉండటంతో ఇబ్బంది పడ్డానని.. ఆ స్థితిలో టి.కృష్ణగారు సాయికుమార్ తో తనకు డబ్బింగ్ చెప్పించాడని.. తర్వాత అలాగే కంటిన్యూ అయిపోయానని చెప్పాడు.

తనకు నత్తి ఉండటం వల్ల డైలాగ్ కు వాయిస్ సింక్ చేయడం కూడా కష్టమే అని.. కొన్నిసార్లు తనకు అమ్మా అనే మాట కూడా రాదని రాజశేఖర్ తెలిపాడు. ముఖ్యంగా షూటింగ్ టైంలో కెమెరా ముందుకు వస్తే మరింతగా మాట తడబడుతుందని.. రవిరాజా పినిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సమయంలో తాను డైలాగ్ చెప్పేముందు అవసరం లేకుండా తలుపు తట్టానని.. రవిరాజా కోప్పడ్డారని.. ఐతే తనకు మాట తడబడుతుంది కాబట్టి మూమెంట్ కోసం అలా తలుపు తట్టానని చెప్పడంతో ఆయన ఓకే అన్నారని రాజశేఖర్ వెల్లడించాడు.
Tags:    

Similar News