అవతార్ రేంజ్ కాదంటున్న జక్కన్న

Update: 2015-12-21 15:07 GMT
ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అన్న మాటను తూచా తప్పకుండా పాటించే దర్శకుడు రాజమౌళి. జక్కన్న సినిమాలు జనాలకు ఎంత నచ్చుతాయో అతడి ప్రవర్తన కూడా అంతే నచ్చుతుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరగడానికి ఇదో కారణం. తన సినిమాల విషయంలో తప్పొప్పుల్ని వినమ్రంగా ఒప్పుకుంటాడు రాజమౌళి. అదే సమయంలో తమ కష్టం గురించి గర్వంగా చెప్పుకుంటాడు. భారతీయ సినీ పరిశ్రమను విస్మయానికి గురి చేసిన ‘బాహుబలి’ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ జక్కన్న తన వినమ్రతను ప్రదర్శించాడు. అదే సమయంలో తన టీం గొప్పదనాన్ని కూడా చాటిచెప్పాడు.

‘బాహుబలి’ కోసం సమకూర్చిన విజువల్ ఎఫెక్ట్స్ కోసం రూ.22 కోట్లే ఖర్చయిందని చెప్పాడు జక్కన్న. ఐతే అవతార్, లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాలతో పోలిస్తే తన సినిమాలో విజువల్ ఎఫెక్టులు మరీ అంత గొప్పగా ఏమీ ఉండవని.. కానీ ఆ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి కూడా మరువరాదని చెప్పాడు జక్కన్న. తనకున్న పరిమితుల్లో.. తక్కువ బడ్జెట్లో ఈ మాత్రం ఔట్ పుట్ తేగలిగినందుకు తాను గర్విస్తానని చెప్పాడు రాజమౌళి. ఐతే ‘బాహుబలి.. ది బిగినింగ్’ విషయంలో ఉన్న లిమిటేషన్స్ ‘బాహుబలి.. ది కంక్లూజన్’కు లేవు. బడ్జెట్ పరిధి పెరిగింది. మరి ఈ అడ్వాంటేజ్ తో జక్కన్న మరింత గొప్ప ఔట్ పుట్ తీసుకురావడం ఖాయమన్నమాట.
Tags:    

Similar News