స్టార్ ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ మూవ్.. మైత్రి నుంచి ఇంటెన్స్ అనౌన్స్‌మెంట్!

పోస్టర్లో ప్రత్యేకంగా Blood Followed The Flood అని ఉన్న ట్యాగ్‌లైన్ కథలోని హింస, ఎమోష‌న్ మరియు మానవ సహజ స్వభావాల మధ్య జరిగే ఘర్షణను సూచిస్తోంది.;

Update: 2026-03-24 12:00 GMT

తమిళ సినీ ప్రపంచంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ప్రయోగాత్మక కథలకు కొత్త ఊపిరి పోస్తున్న సమయంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ అయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తమ మూడో తమిళ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. #మైత్రీత‌మిళ్03 పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో, తన ప్రత్యేక నటనతో రీసెంట్ గా వ‌రుస స‌క్సెస్‌లు అందుకుంటున్న నటుడు సూరి ప్రధాన పాత్రలో కనిపించనుండ‌గా, ఈ సినిమాకు సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌ల‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న R. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.

 

ఆస‌క్తి రేకెత్తిస్తున్న పోస్ట‌ర్

ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. వరద నీటిలో నడుము వరకు మునిగిన ఓ వ్యక్తిని వెనుక నుంచి చూపిస్తూ రూపొందించిన ఈ పోస్ట‌ర్ గాఢమైన మూడ్‌ను సృష్టిస్తోంది. నీటిలో కనిపించే అతని నీడ వంకర తిరుగుతూ ఉండటం కథలోని అస్థిరతను, అంతర్గత కలతను సూచిస్తుండ‌గా, అతని చేతిలోని ఆయుధం ప్రమాదాన్ని సూచిస్తుంది. చుట్టూ కనిపించే పగిలిన సామాన్లు, చెదిరిపోయిన వస్తువులు, తలకిందులైన గ్యాస్ సిలిండర్.. ఇవ‌న్నీ క‌లిసి ఒక విధ్వంసం త‌ర్వాతి దృశ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. పైగా ముందు వైపున్న తలుపు నుంచి వస్తున్న ఎరుపు వెలుగు ఒక రహస్యమైన, భయానక వాతావరణాన్ని సూచిస్తోంది.

భిన్న‌మైన క‌థ‌తో రానున్న ర‌వికుమార్

పోస్టర్లో ప్రత్యేకంగా Blood Followed The Flood అని ఉన్న ట్యాగ్‌లైన్ కథలోని హింస, ఎమోష‌న్ మరియు మానవ సహజ స్వభావాల మధ్య జరిగే ఘర్షణను సూచిస్తోంది. ఇది కేవలం ఒక యాక్షన్ డ్రామాగా కాకుండా, లోతైన భావోద్వేగాలతో నిండిన కథగా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తోంది. రీసెంట్ గా కొట్టుక్కాలి, విడుద‌లై, మామ‌న‌న్ లాంటి సినిమాల‌తో నటుడిగా తన పరిధిని విస్తరించిన సూరి, ఈ ప్రాజెక్ట్‌తో మరింత విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడనే అంచనాలున్నాయి. మరోవైపు, ఇండ్రు నేట్రు నాళై, అయలాన్ వంటి సినిమాల‌తో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ప్రత్యేక ముద్ర వేసిన డైరెక్ట‌ర్ రవికుమార్, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఇక నిర్మాణ సంస్థ విష‌యానికొస్తే, ఇప్పటికే తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ లాంటి సినిమాల‌తో కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్, ఈ మూడో ప్రయత్నంతో మరింత బలమైన స్థానాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ఉంది. మొత్తం మీద, ప్రతిభావంతులైన ఈ ముగ్గురి కలయిక, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో కూడిన ఈ సినిమా ప్రారంభ దశలోనే భారీ అంచనాలను సృష్టిస్తోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News