నేత్రదానం: పదిమందికి ఆదర్శంగా నిలిచిన సినీ తారలు

న‌టుడు, ద‌ర్శ‌క‌దిగ్గ‌జం కె. భాగ్యరాజ్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలోని బెసెంట్ నగర్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

Update: 2026-06-28 16:30 GMT

కళ్లు లేని వారికి చూపునివ్వడం అనేది ఒక మనిషికి సాధ్య‌మ‌య్యే ఒక‌ సామాజిక బాధ్యత. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మరణానంతరం ఆయన కుటుంబీకులు ఆయన నేత్రాలను దానం చేసి ప‌దిమందికీ ఆదర్శంగా నిలిచారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే తాము మరణించిన తర్వాత కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి, కళ్లు దానం చేసిన‌వారు.. జీవించి ఉండ‌గానే దానమిస్తున్నామ‌ని ప్రతిజ్ఞ చేసిన మరికొందరు నటుల వివరాలు ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి.

గతంలో కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలిగిన పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 2021లో అకాల మరణం చెందినప్పుడు కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేయగా.. వాటి ద్వారా ఇద్ద‌రు అంధులకు చూపు లభించింది. అంతకుముందు ఆయన తండ్రి, కన్నడ లెజెండ‌రీ నటుడు రాజ్‌కుమార్ కూడా మరణానంతరం నేత్ర దానం చేయడం విశేషం. అలాగే టాలీవుడ్ న‌టుడు, రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం చెందినప్పుడు కూడా ఆయన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు.

మరోవైపు తాము బ్రతికుండగానే మరణానంతరం నేత్ర దానం చేయడానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర తారలు ప్రతిజ్ఞ చేశారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా `చిరంజీవి ఐ బ్యాంక్` స్థాపించి లక్షలాది మందిలో అవగాహన కల్పించడమే కాకుండా.. తన కళ్లను దానం చేయడానికి ముందే సైన్ చేశారు. ఆయనతో పాటు అక్కినేని నాగార్జున, అమల, కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, సూర్య, బాలీవుడ్ నుండి ఐశ్వర్యా రాయ్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి టాప్ సెలబ్రిటీలు కూడా తమ నేత్రాలను దానం చేయడానికి అంగీకరిస్తూ అధికారికంగా సంతకాలు చేసి సమాజంలో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టారు.

అంత్య‌క్రియ‌లు పూర్తి:

న‌టుడు, ద‌ర్శ‌క‌దిగ్గ‌జం కె. భాగ్యరాజ్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలోని బెసెంట్ నగర్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. 73 సంవత్సరాల వయసులో ఆయన శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. దిగ్గ‌జ ద‌ర్శ‌క‌న‌టుడి మరణవార్త విన్న సినీ పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు నుంగంబాక్కంలోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి తమ చివరి నివాళులర్పించారు.

ఆయన నివాసంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం... భాగ్యరాజ్ భౌతికకాయాన్ని చెన్నై వీధుల గుండా బెసెంట్ నగర్ శ్మశానవాటికకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ అంతిమయాత్రలో నటులు ఆర్. పార్థిబన్ -ఆర్. శరత్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాడెను మోశారు. శ్మశానవాటిక వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల అనంతరం కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, అభిమానుల అశ్రునయనాల మధ్య భాగ్య‌రాజా అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Tags:    

Similar News