నోలాన్ 'ది ఒడిస్సీ': గుహలో ఒంటి కన్ను రాక్షసుడి సీన్ సినిమాకే హైలైట్
ఒంటి కన్ను రాక్షసుడు లేదా ఏకనేత్ర రాక్షసుడు అనగానే మనకు చిన్నప్పుడు చదువుకున్న చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లోని భేతాళ, భట్టి విక్రమార్క కథలు గుర్తుకువస్తాయి.
ఒంటి కన్ను రాక్షసుడు లేదా ఏకనేత్ర రాక్షసుడు అనగానే మనకు చిన్నప్పుడు చదువుకున్న చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లోని భేతాళ, భట్టి విక్రమార్క కథలు గుర్తుకువస్తాయి. విక్రమాదిత్యుడు తన మంత్రి భట్టితో కలిసి అరణ్యాలలో ప్రయాణిస్తున్నప్పుడు.. దేశ సంచారం చేస్తున్నప్పుడు నుదిటి మధ్యలో ఒకే కన్ను కలిగి, భారీ శరీరంతో భయపెట్టే ఇలాంటి వింత రాక్షసులు ఎదురవుతుంటారు. అప్పట్లో విక్రమార్కుడు తన అపారమైన ధైర్యసాహసాలతో భట్టి అందించే యుక్తులతో ఆ రాక్షసులను ఓడించి ప్రజలను రక్షించేవాడు. ఇలాంటి కథలు భారతీయ పురాణ, జానపద కథల్లో నిక్షిప్తమైన నిధులు.
కేవలం భారతీయ కథల్లోనే కాకుండా గ్రీక్ పురాణాల్లోనూ ఈ ఒంటి కన్ను రాక్షసుడి ప్రస్తావన ఉంది. ఇప్పుడు అదే రూపాన్ని హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరపైకి తీసుకువస్తున్నారు. ప్రఖ్యాత రచయిత హోమర్ రాసిన పురాతన గ్రీక్ పురాణ కావ్యం ఆధారంగా ఆయన తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా `ది ఒడిస్సీ` చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నోలన్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ, భీతి గొలిపే ఒక విజువల్ హారర్ నైట్‌మేర్‌గా ఈ ఒంటి కన్ను రాక్షసుడి (సైక్లాప్స్ - పొలిఫెమస్) సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారు.
సాధారణంగా నేటితరం దర్శకులు ఇలాంటి భారీ రాక్షస పాత్రలను సృష్టించడానికి పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీఐ) లేదా గ్రీన్ మ్యాట్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ నోలన్ దీనికి భిన్నంగా ఎలాంటి కార్టూన్ లు లేదా గ్రాఫిక్స్ ఫీల్ లేకుండా నిజ జీవితంలో ఆ రాక్షసుడు ఎదురైతే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా 60 అడుగుల భారీ మెకానికల్ ఆంత్రోపోమార్ఫిక్ పప్పెట్‌ను (యాంత్రిక బొమ్మ) నేరుగా సెట్‌లోనే నిర్మించి ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ముఖంపై పెద్ద గాయాలు, అసమానమైన రూపంతో భయం గొలిపేలా ఉన్న ఈ రాక్షసుడి కదలికలను చిత్రీకరించారట. దీనిని `ఇంటర్‌స్టెల్లార్` సినిమాలో TARS రోబోకు వాయిస్ అండ్ ఆపరేషన్ అందించిన బిల్ ఇర్విన్ పర్యవేక్షించడం విశేషం.
ఈ భయంకరమైన హారర్ సీక్వెన్స్‌ను గ్రీస్‌లోని ప్రఖ్యాత `నెస్టర్స్ కేవ్` గుహలలో అత్యంత సహజంగా చిత్రీకరించారు. గుహ ద్వారానికి భారీ రాయిని అడ్డుగా పెట్టిన తర్వాత లోపల ఏర్పడే చిమ్మచీకటి.. ఇరుకైన ప్రదేశంలో ఊపిరాడనట్లు ఉండే వాతావరణాన్ని కెమెరాలో అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హోయ్టే వాన్ హోయ్టెమాతో కలిసి నోలన్ ఈ సీక్వెన్స్ మొత్తాన్ని కటిక చీకటి - అతి తక్కువ లైటింగ్‌లో కేవలం ట్రాకింగ్ షాట్స్ ఉపయోగించి పూర్తి ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేసారట. ఇది విజువల్ గా థియేటర్లలో గగుర్పాటుకు గురి చేసే సరికొత్త మాయాజాలంతో భయపెడుతుందని తెలుస్తోంది.
ఒడిస్సియస్ (మాట్ డామన్), అతడి సైనికులు ఆ రాక్షసుడి గుహలో చిక్కుకున్నప్పుడు అనుభవించిన భయానక క్షణాలను ఆడియన్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ఫీల్ అయ్యేలా ఈ సీన్‌ను మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో తీర్చిదిద్దారని తెలుస్తోంది. మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి హాలీవుడ్ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు థియేటర్లలో ఒక సరికొత్త హారర్ - మైథలాజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈరోజుల్లో కిడ్స్ బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర కథలు చదివే పరిస్థితిలో లేరు. ఇప్పుడు అంతా సినిమాల్లో, హాలీవుడ్ వెబ్ సిరీస్ లలో చూసి తెలుసుకోవాల్సిందే. అలాంటి వారికి మరోసారి పురాణాల్లోని అసాధారణ పాత్రలను పరిచయం చేయాలనే ఆలోచన నోలాన్ లాంటి ప్రఖ్యాత దర్శకుడికి రావడం నిజంగా స్ఫూర్తిదాయకం.