రన్‌టైమ్ నో ఇష్యూ..కంటెంట్‌కే జైకొడుతున్నారు!
కంటెంట్ ఈజ్ ద కింగ్ అని చిన్న సినిమాల నుంచి పాన్ ఇండిమా మూవీస్ వరకు నిరూపించాయి.;
కంటెంట్ ఈజ్ ద కింగ్ అని చిన్న సినిమాల నుంచి పాన్ ఇండిమా మూవీస్ వరకు నిరూపించాయి. ఇప్పటికీ ప్రేక్షకులు కంటెంట్‌కే జై కొడుతున్నారు. సినిమాలో స్టార్స్ ఉన్నారా? ఎలాంటి సీన్స్ ఉన్నాయి?..యాక్షన్ ఉందా? ..మెస్మరైజ్ చేసే అంశాలు ఉన్నాయా? అని చూడటం లేదు. కంటెంట్ బలంగా ఉందా?..సినిమాకు వెళితే కొత్త ఎక్స్‌పీరియన్స్‌కి లోనవుతామా?..అన్నదే చూస్తున్నారే కానీ రన్ టైమ్ ఎంతుంది? ఇన్ని గంటలు థియేటర్లో కూర్చోగలమా? అని చూడటం లేదు.
`పాతాళభైరవి` సినిమానే చెబుతోంది...
కంటెంట్ బాగుందంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విషయాన్ని నాటి పాతాళభైరవి నుంచి నేటి `ధురంధర్ ది రివేంజ్` వరకు ప్రేక్షకులు నిరూపించారు. ఇప్పటికీ..ఎప్పటికీ కంటెంట్ ఈజ్ ద కింగ్ అని దానికే మా ప్రాధాన్యత అని చెబుతూ అలా బలమైన కంటెంట్‌తో రూపొందిన సినిమాలకే జేజేలు పలుకుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. సినిమా నిడివి అన్నది పెద్దగా పట్టించుకోవడం లేదు. 90వ దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా వరకు రెండు గంటల నలభైఏదు నిమిషాల నుంచి మూడు గంటల నిడివితో వచ్చినవే.
1951లో విడుదలైన భారతీయ సినీ చరిత్రలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన `పాతాళభైరవి` సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు. అంటే మన వాళ్లు ఆ కాలం నుంచే కంటెంట్‌కు ప్రధాన్యత ఇచ్చారే కానీ ఎక్కడా రన్‌టైమ్‌కు ప్రధాన్యత ఇవ్వలేదు. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటే మూడున్నర గంటల పాటు సినిమా చూడటానికి అప్పటి నుంచే ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారని `పాతాళభైరవి` సినిమానే చెబుతోంది. అదే సూత్రాన్ని గత రెండు మూడేళ్లుగా పాన్ ఇండియా సినిమాలు ఫాలో అవుతూ వస్తున్నాయి.
`అర్జున్‌రెడ్డి`తో మొదలైంది..
కథ బాగుంటే నిడివితో పనిలేదని చాలా సినిమాలు ఇటీవల నిరూపించాయి. సినిమా సక్సెస్‌కు నిడివి పెద్ద ఇష్యూనే కాదని, ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథే ప్రధానమని అర్జున్‌రెడ్డి సినిమా నిరూపించింది. విజయ్ దేవరకొండ అప్పుడప్పుడే స్టార్‌గా ఎదురుతున్నాడు. అలాంటి హీరో సినిమాని మూడు గంటలపై నిడితో ప్రేక్షకులు చూస్తారని ఎవరూ ఊహించలేదు. చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరాలు చెప్పినా..ఎగ్జిబిటర్లు రన్ టైమ్ కుదించాల్సిందేనని మొండికేసినా సందీప్‌రెడ్డి వంగ పట్టించుకోకుండా వారితో గట్టిగా వాదించి తను అనుకున్న రన్ టైమ్‌తోనే సినిమాని రిలీజ్ చేసి పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవడం తెలిసిందే.
అప్పటి నుంచే కంటెంట్ బాగుంటే రన్ టైమ్ పెద్ద ఇష్యూ కాదని స్టార్ డైరెక్టర్‌లు నమ్మడం మొదలు పెట్టారు. అలా చేసిన యానిమల్, పుష్ప 2, ధురంధర్, ధురంధర్ 2 చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. రన్‌బీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రన్ టైమ్ 3:24 గంటలు. అయినా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక దీని తరువాత అల్లు అర్జున్, సుకుమార్‌ల కలయికలో వచ్చిన పాన్ ఇండియా మూవీ `పుష్ప 2` దీని రన్ టైమ్ 3:21 గంటలు. దీని ఫలితం తెలిసిందే.
ఇక గత ఏడాది విడుదలైన `ధురంధర్` రన్ టైమ్ 3:40 గంటలు, మార్చి 19న విడుదలైన `ధురంధర్ 2` రన్టైమ్ 3:51 గంటలు. దీని ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలతో బలమైన కథతో వస్తే బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతామని ప్రేక్షకులు నిరూపించారు. దీంతో బలమైన కంటెంట్, హత్తుకునే భావోద్వేగాల సమాహారంగా సినిమా చేస్తే ప్రేక్షకులు రన్ టైమ్ గురించి పెద్దగా పట్టించుకోరని తేలిపోయింది.