మరోసారి జై భీమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా దక్కించుకుంది.
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాల్లో జై భీమ్ ఒకటి. సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా దక్కించుకుంది. ఇప్పుడదే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో సూర్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.
కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా సక్సెస్‌లతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్‌కు ఇది సూర్యతో మొదటి సినిమా కావడం విశేషం. నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. కథకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ, ఎమోషన్స్ కు ప్రాధాన్యమిస్తూనే కమర్షియల్ అంశాలను సమతుల్యం చేసే మంచి డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా యువ నటి కయాదు లోహర్ ఎంపికైనట్టు సమాచారం. రీసెంట్ టైమ్స్ లో ఆమెకు పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశం ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మ్యూజిక్ బాధ్యతల్ని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ నిర్వహిస్తుండగా, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందనున్నట్టు సమాచారం.
రీసెంట్ గా రజనీకాంత్‌తో వేట్టయాన్ తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్, మరోసారి సూర్యతో కలిసి పని చేయడం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. జై భీమ్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో కథ ఎంపిక విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక స్పృహతో కూడిన అంశాలను ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో జ్ఞానవేల్‌కు ఉన్న ప్రత్యేక శైలి ఈ సినిమాలో కూడా కనిపించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, సూర్య ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ మరోసారి జై భీమ్ స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.