గొప్ప కళాకారిణికి అవమానం.. టైటిల్ వివాదంలో శ్రద్ధాకపూర్ 'ఈత'
సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ `ఈత` విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ `ఈత` విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా లెజెండ్, పండరీపురానికి చెందిన ప్రఖ్యాత లావణి నృత్యకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మహారాష్ట్ర జానపద కళలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఈ నర్తకి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ సినిమాకు `ఈత` అనే టైటిల్ పెట్టడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పేరు విఠాబాయి వారసత్వానికి...ఆమె కీర్తికి తగిన గౌరవాన్ని ఇచ్చేలా లేదని ఇండస్ట్రీ వర్గాలతో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) కి చెందిన ఫిల్మ్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఈ టైటిల్‌ను మార్చాలంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. విఠాబాయి కేవలం ఒక జానపద కళాకారిణి మాత్రమే కాదని.. మహారాష్ట్ర సాంస్కృతిక చరిత్రకు ఈ నర్తకి ఒక ప్రతిరూపమని ఎన్‌సిపి మహారాష్ట్ర అధ్యక్షుడు బాబాసాహెబ్ పాటిల్ పేర్కొన్నారు. `ఈత` అనే పేరు వీఠాభాయి అసాధారణ కథను తక్కువ చేసి చూపించేలా ఉందని... మహారాష్ట్ర సంస్కృతికి జీవం పోసిన ఆ మహనీయురాలికి చిత్ర యూనిట్ అత్యున్నత గౌరవం, మర్యాదలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాజకీయ నిరసనలకు తోడు విఠాబాయి కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగడంతో ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఎన్‌సిపి చేస్తున్న ఈ పోరాటానికి విఠాబాయి కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆమె కుమారులు కైలాష్, రాజేష్‌లతో పాటు మనవడు మోహిత్ కూడా బహిరంగంగానే ఈ టైటిల్‌ను తప్పుపట్టారు. 1957, 1990లలో రెండుసార్లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులను అందుకున్న అంతటి గొప్ప కళాకారిణి బయోపిక్‌కు ఆమె అసలు పేరు (విఠాబాయి) ఉండేలా టైటిల్ మార్చాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కళ కోసం జీవితాన్ని ధారపోసి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడిన ఈ నృత్యకారిణి కథకు సరైన గౌరవం ఇవ్వడమంటే టైటిల్‌లో ఆమె పేరును గౌరవప్రదంగా ఉంచడమేనని వారు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు... ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా లావణి అవతారంలో శ్రద్ధా కపూర్ చూపించిన ట్రాన్స్‌ఫార్మేషన్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. టీజర్‌లో చూపించిన ఒక నాటకీయ సన్నివేశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిండు గర్భిణిగా ఉన్న విఠాబాయి స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూనే, నొప్పులు రావడంతో బ్యాక్‌స్టేజ్‌కు వెళ్లి స్వయంగా కాన్పు చేసుకుని.. బొడ్డు తాడును కట్ చేసుకుని మళ్లీ వచ్చి ప్రదర్శనను పూర్తి చేస్తుంది. నిజ జీవితంలో ప్రజలు ఆమెను విశ్రాంతి తీసుకోమని కోరినా.. సినిమాలో ఆమె పట్టుదలను హైలైట్ చేస్తూ ఈ సీన్ డిజైన్ చేశారు. ముంబై, సోలాపూర్, సతారా, నాసిక్ వంటి పలు వాస్తవ ప్రాంతాలలో ఈ చిత్రాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించారు.
మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణదీప్ హుడా, మహ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమై ఆగస్టు 28న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మేకర్స్ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. ఒకవేళ వివాదానికి భయపడి `విఠాబాయి`గా టైటిల్ మారిస్తే... కేవలం రెండు నెలల లోపు కొత్త పేరుతో మార్కెటింగ్ స్ట్రాటజీని మొదటి నుండి రీ-బ్రాండ్ చేయడం భారీ నష్టంతో కూడుకున్న పని. అలాగని అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే నిరసనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కానీ.. నిర్మాణ సంస్థ కానీ ఇంకా నోరు విప్పలేదు. అందరూ వారి సమాధానం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.