ఓటిటి బిజినెస్ ట్రెండ్స్ - సవాళ్లు!
సినిమా నిర్మాణ వ్యయం, వ్యాపార సమీకరణాలు కాలంతో పాటు వేగంగా మారుతున్నాయి.
సినిమా నిర్మాణ వ్యయం, వ్యాపార సమీకరణాలు కాలంతో పాటు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో సింహభాగం రికవరీ కావడానికి సాటిలైట్ రైట్స్ ప్రాణంగా ఉండేవి. నిర్మాతలు కూడా టీవీ ఛానళ్లతో జరిగే ఒప్పందాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకునేవారు. కానీ డిజిటల్ విప్లవం తర్వాత ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా నిర్మాతలు శాటిలైట్ రైట్స్‌ను పక్కన పెట్టి, డిజిటల్ (ఓటిటి) రైట్స్‌పైనే వ్యాపార ఆశలన్నీ పెట్టుకుంటున్నారు.
ఈ సరికొత్త ఓటిటి బిజినెస్ ట్రెండ్‌లో భాగంగా భారీ కాంబినేషన్లు, పాన్-ఇండియా క్రేజ్ ఉన్న క్రేజీ ప్రాజెక్టులకు డిజిటల్ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. ప్రభాస్-సందీప్ వంగా కాంబోలో తెరకెక్కుతోన్న `స్పిరిట్`, ప్రశాంత్ నీల్, ఎస్.ఎస్. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ల అప్కమింగ్ ప్రాజెక్టులైన `ఫౌజీ`, `వారణాసి`, `రాకా` వంటి మోస్ట్ అవేటెడ్ సినిమాల ఓటిటి హక్కులు షూటింగ్ దశలోనే భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి. ఓటిటి సంస్థలు సైతం ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు, దర్శకుల ఇమేజ్‌ను నమ్ముకుని వందల కోట్ల అడ్వాన్స్ బిజినెస్‌లతో సినిమాలను ముందే చేజిక్కించుకుంటున్నాయి.
అయితే నాణేనికి మరోవైపు మీడియం రేంజ్ - చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఓటిటి మార్కెట్ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఓటిటి సంస్థలు మంచి బిజినెస్ ఆఫర్ చేసేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు తమ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశాయి. మీడియం రేంజ్ సినిమాల విషయంలో కేవలం కాంబినేషన్లను చూసి ముందే కొనుగోలు చేయడానికి సంస్థలు అస్సలు ఇష్టపడటం లేదు.
ప్రస్తుతం ఓటిటి సంస్థలు మీడియం బడ్జెట్ చిత్రాల మేకర్స్‌కు కఠినమైన నిబంధనను విధిస్తున్నాయి. సినిమా పూర్తి కంటెంట్ చూసి థియేట్రికల్ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద వచ్చే టాక్ -ప్రేక్షకుల స్పందనను బట్టే డిజిటల్ రైట్స్ రేటును నిర్ణయిస్తామని మొండికేస్తున్నాయి. థియేటర్లలో మినిమం ఇంపాక్ట్ చూపించని చిత్రాలను ఓటిటిలో స్ట్రీమింగ్ చేయడానికి కూడా సదరు సంస్థలు ఆసక్తి చూపించడం లేదు. దీనివల్ల మీడియం రేంజ్ నిర్మాతలకు సినిమా విడుదలకు ముందు బిజినెస్ క్లోజ్ అవ్వడం పెద్ద టాస్క్‌గా మారింది.
మారిన ట్రెండ్ వల్ల పరిశ్రమలో కాంబినేషన్ల కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కేవలం ఒక మోస్తరు క్రేజ్ ఉన్న హీరో, డైరెక్టర్ కలిసినంత మాత్రాన డిజిటల్ రైట్స్ రూపంలో సేఫ్ జోన్‌లోకి వెళ్లడం ఇకపై కుదరదు. కథలో దమ్ము ఉండి థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే ఓటిటిలో కూడా మంచి బిజినెస్ విలువ దక్కుతుంది. ఈ పరిణామం చిత్ర పరిశ్రమలో అనవసరపు బడ్జెట్ వ్యయాన్ని తగ్గించి, కథా బలంపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తోంది.
ఓటిటి బిజినెస్ పద్ధతులు నిర్మాతలకు ఒకవైపు భారీ అవకాశాలను ఇస్తూనే మరోవైపు కంటెంట్ విషయంలో కఠినమైన సవాళ్లను విసురుతున్నాయి. పెద్ద సినిమాలకు ఏడాది ముందే వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నా? మీడియం రేంజ్ చిత్రాలు మాత్రం థియేటర్లలో సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హెచ్చుతగ్గుల డిజిటల్ మార్కెట్ ట్రెండ్‌ను తట్టుకుని నిలబడాలంటే.. పరిశ్రమ కేవలం స్టార్ పవర్ పైనే కాకుండా బలమైన కంటెంట్‌ను నమ్ముకుని ముందుకు సాగాల్సి ఉంది.