యావ‌త్ సినీ భార‌తం సాహోరే అంటోంది

Update: 2021-12-21 00:30 GMT
భార‌తీయ సినిమాని `బాహుబ‌లి`కి ముందు.. `బాహుబ‌లి` త‌రువాత అని చూడాల్సిందే. ఎందుకంటే హాలీవుడ్ మేక‌ర్స్ ని సైతం ఇండియా వైపు అది కూడా ద‌క్షిణాది చిత్రాల వైపు తిరిగి చూసేలా చేసింది. ఈ సినిమా త‌రువాతే బాలీవుడ్ హీరోల్లో, మేక‌ర్స్ లో మార్పులు మొద‌ల‌య్యాయి. తెలుగు సినిమా అంటే దేశ వ్యాప్తంగా గౌర‌వం పెరిగింది. మంచి మార్కెట్ కూడా ఏర్ప‌డింది. `బాహుబ‌లి`కి ముందు తెలుగు సినిమా అంటే బాలీవుడ్ లో చిన్న చూపు వున్న మాట ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే.

మ‌న సినిమాల రీమేక్ ల‌తో స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్నా బాలీవుడ్ వ‌ర్గాల్లో మాత్రం తెలుగుకు పెద్ద‌గా ప్రాధాన్య‌త వుండేది కాదు. గ‌తంలో ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్‌ల హ‌యాంలో బాలీవుడ్  కు ద‌క్షిణాది తార‌కు మ‌ధ్య మంచి స‌ఖ్య‌త వుండేది. అది మ‌హాన‌టి సావిత్రి చిత్రంలోని ఓ స‌న్నివేశంలో చూపించారు కూడా. అయితే ఆ త‌రువాతే రోజులు మారాయి. ద‌క్షిణాది చిత్రాల‌పై చిన్న చూపు మొద‌లైంది.. ఈ బారియ‌ర్స్‌ని బ‌ద్ద‌లు కొట్టింది `బాహుబ‌లి` అన‌డం కంటే ఆ సినిమా సృష్టి క‌ర్త రాజ‌మౌళి అన‌డం క‌రెక్ట్.

ఎంద‌కంటే ఆయ‌న ప్ర‌తిభ కార‌ణంగానే ఇప్పుడు ప్ర‌పంచ సినిమా తెలుగు సినిమా అంటే అటెన్ష‌న్ గా చూస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ వ‌ర్గాల్లోని క‌ర‌న్ జోహార్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, అమీర్ ఖాన్ వంటి హీరోలు రాజ‌మౌళికి టాలెంట్ కి ఫిదా అయిపోతున్నారు. ఈ మార్పుకు ప్ర‌ధాన కార‌కుడు రాజ‌మౌళి. అత‌ని వ‌ల్లే గ‌త కొంత కాలంగా వేరుగా వున్న ఇండియ‌న్ సినిమా ఒక్క‌టైంది. ఒక తాటిపైకి వ‌చ్చేసింది. ఇదే విష‌యాన్ని బిగ‌బాస్ గ్రాండ్ ఫినాలే వేదిక‌గా కింగ్ నాగార్జున స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఆదివారం జ‌రిగింది. ఈ గ్రాండ్ గాలా ఈవెంట్ లో రాజ‌మౌళితో పాటు `బ్ర‌హ్మాస్త్ర` ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ, హీరో ర‌ణ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళిని పొగిడిన నాగార్జున ఇండియ‌న్ సినిమాని ఒక్క‌టి చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని గ‌ర్వంగా చెప్ప‌డం విశేషం. దీన్ని బ‌ల‌ప‌రుస్తూ `బ్ర‌హ్మాస్త్ర` టీమ్ అయాన్ ముఖ‌ర్జీ, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ .. ద‌ర్శకుడు రాజ‌మౌళికి అత్యున్న‌త‌మైన గౌర‌వాన్నివ్వ‌డం.. ఇదే వేదిక సాక్షిగా గ‌తంలో బాలీవుడ్ కు చెందిన ఒక‌ప్ప‌టి స్టార్స్ సౌత్ స్టార్స్ తో ఎలా క‌లిసిపోయి క‌లివిడిగా త‌మ భావాలను పంచుకున్నారో ర‌ణ్ బీర్ కొన్ని ఫొటోల‌ని ప్ర‌ద‌ర్శించ‌డం అక్క‌డున్న వారితో పాటు నాగార్జునకు ఆశ్చ‌ర్యాన్ని ఆనందాన్ని క‌లిగించింది. ఈ ఫొటోలు చూసిన వెంట‌నే మ‌ధ్య‌లో తెగిన బంధం ఇప్పుడు క‌లిసింద‌ని అది రాజ‌మౌళి వ‌ల్లే సాధ్య‌మైంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అందుకే `బ్ర‌హ్మాస్త్ర‌` తెలుగు వెర్ష‌న్ కు రాజ‌మౌళిని చిత్ర బృందం భాగ‌స్వామిగా చేసుకున్నారు. బాలీవుడ్ కంటే తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లే త‌నకు ముఖ్య‌మ‌ని అందుకే ముందు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకోవాల‌ని ఇక్క‌డికి వ‌చ్చాన‌ని ఈ సంద‌ర్భంగా అయాన్ ప‌ట్టుబ‌ట్టాడ‌ని అలియా భ‌ట్ , ర‌ణ్ బీర్ క‌పూర్ పేర్కొన‌డం.. ఇటీవ‌ల జ‌రిగిన `బ్ర‌హ్మాస్త్ర‌` మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో ర‌ణ్ బీర్ .. రాజ‌మౌళి కాళ్ల‌కి మొక్క‌డం... అయాన్ ముఖ‌ర్జీ నాగ్ కాళ్ల‌కి న‌మ‌స్క‌రించ‌డం రాజ‌మౌళి తెచ్చిన మార్పుకు ప్ర‌ధాన కార‌ణాలుగా చెబుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో సౌత్ స‌త్తాని యావ‌త్ భార‌తానికి చాటిన రాజ‌మౌళి ఇదే సినిమాతో ఇండియాన్ సినిమాని ఏకం చేసి సాహోరే రాజ‌మౌళి అనిపించుకుంటున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి.
Tags:    

Similar News