రాజమౌళి ఎఫెక్ట్: ఇతర దర్శకులకు.. నిర్మాతలకు హీట్!

Update: 2020-04-28 08:10 GMT
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. దేశవ్యాప్తంగా మన సినిమాలను ఆదరిస్తారని.. భారీ బడ్జెట్లను కూడా మనం తిరిగి రాబట్టుకోవచ్చని రాజమౌళి నిరూపించారు. ఇక మన స్టార్ హీరోలను కూడా నార్త్ లో ఆదరిస్తారని కూడా ఋజువు చేశారు.  దీంతో నిజానికి సౌత్ లో ప్యాన్ ఇండియా సినిమాల కల్చర్ ఊపందుకుంది. మన స్టార్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే ఒక వైపు టాలీవుడ్ రేంజ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది కానీ మరోవైపు ఇతర దర్శకులపై.. నిర్మాతలపై ఒత్తిడి పెంచుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజమౌళి ఎఫెక్ట్ తో స్టార్ హీరోలందరూ దాదాపుగా ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తుండడంతో ఇతర డైరెక్టర్లకు.. నిర్మాతలకు తలప్రాణం తోకకు వస్తోందట. కారణం ఏంటంటే  హీరోల దగ్గరకు ఎవరు స్క్రిప్ట్ తీసుకెళ్ళినా దానికి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందా లేదా అనే అంశం చూస్తున్నారట. ఒకవేళ లోకల్ ఫ్లేవర్ ఉంటే.. అలా యూనివర్సల్ అప్పీల్ ఉండేలా మార్చమని ఏళ్ళకు ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్ పై కూర్చోపెడుతున్నారట.  దీంతో దర్శకులకు టైమ్ వేస్ట్ అవుతోందని అంటున్నారు.

మరోవైపు నిర్మాతలకు కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు టేకప్ చెయ్యడం కత్తిమీద సామే.  భారీ బడ్జెట్లు పెడితే ఈ హీరోలను నిజంగా మన తెలుగు రాష్ట్రాల బయట ఆదరిస్తారో లేదో ఎవరికీ తెలియదు. పైగా ఈ దర్శకులకు ప్యాన్ ఇండియన్ సినిమాలు తీసే సత్తా ఉందా.. ఇతర భాషా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించగలరా అనేది కూడా సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.  

అన్నీ సినిమాలకు ప్యాన్ ఇండియన్ అప్పీల్ ఉండదు.  అందరూ డైరెక్టర్లు రాజమౌళి లాగా అలాంటి ప్రాజెక్టులు హ్యాండిల్ చెయ్యలేరు. ప్రమోషన్స్ లో రాజమౌళి స్టైల్ అబ్రకదబ్ర మ్యాజిక్ మన టాలీవుడ్ లో ఒక్కరంటే ఒక్కరికి కూడా లేదన్నది కఠిన నిజం. దీంతో రాజమౌళి ఎఫెక్ట్ టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు.. ప్రొడ్యూసర్లకు పెద్ద టెన్షన్ గా మారిందట.
Tags:    

Similar News