పుష్పరాజ్ మేకప్ కోసమే రోజుకు 7-8 గంటలు పట్టేది..!

Update: 2021-12-11 05:50 GMT
'అల వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ''పుష్ప''. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ సినిమా రెడీ అవుతోంది. ఇది వీరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ.. ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం.

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందే ఈ భారీ యాక్షన్ డ్రామాలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. అయితే ఆ పాత్రకు తగ్గట్లు తనను తాను మలచుకోడానికి బన్నీ అంకితభావంతో తీవ్రంగా శ్రమించాడని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని - రవిశంకర్ తెలిపారు.

'పుష్ప' నిర్మాతలు మాట్లాడుతూ.. ''అల్లు అర్జున్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త లుక్ లో కనిపిస్తారు. పుష్పరాజ్‌ గా ఆయన నటన అద్భుతం. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తాయి.

బన్నీ కెరీర్‌ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ మూవీ కోసం ఆయన ఒక ఏడాదికి పైగా కష్టపడ్డాడు. నిత్యం క్యారెక్టర్‌ లో ఉంటూ, మ్యానరిజమ్స్‌ ని పాటిస్తూ పుష్పరాజ్‌ పాత్రలోనే ఉండిపోయారు'' అని చెప్పారు.

''పుష్పరాజ్‌ పాత్రకు సంబంధించి అల్లు అర్జున్ మేకప్‌ కోసమే ప్రతిరోజూ 2 గంటలు సమయం పట్టేది. దీని కోసం ఆయన పొద్దున్నే నిద్ర లేచేవాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ మేకప్ తీసేయడానికి మరో ఒకటిన్నర - రెండు గంటలు పడుతుంది.

ఇలా మేకప్ కు మాత్రమే కొన్నిసార్లు 7-8 గంటలు సమయం కేటాయించేవారు. మిగతా టైంలో షూటింగ్ చేసేవారు. బన్నీ ఈ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తారు. ఫ్యాన్స్‌ కి ఫుల్ ట్రీట్‌'' అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే 'పుష్ప' చిత్రంలో అడవుల్లో తిరిగే స్మగ్లర్ గా.. లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపించడానికి అల్లు అర్జున్ చాలానే కష్టపడ్డారు. హెయిర్ దగ్గర నుంచి కనుబొమ్మలు - గడ్డం మీసాలతో సహా ప్రతి విషయం కూడా రోజువారీ కూలీని గుర్తు చేసే విధంగా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో 'తగ్గేదే లే' అంటూ బన్నీ విపరీతంగా ఆకట్టుకున్నారు.

అల్లు అర్జున్ డెడికేషన్ కు హార్డ్ వర్క్ కి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. 'పుష్ప: ది రైజ్' సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Tags:    

Similar News