'పుష్ప: ది రైజ్' ట్రైలర్: స్మగ్లర్ పుష్పరాజ్ గా అదరగొట్టిన బన్నీ..!

Update: 2021-12-06 16:33 GMT
అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ''పుష్ప: ది రైజ్'' ట్రైలర్ వచ్చేసింది. 'తగ్గేదే లే' అనే ఒకే ఒక్క డైలాగ్ తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసిన బన్నీ.. ట్రైలర్ తో మాస్ ఫెస్టివల్ ప్రారంభించారు. రావడం కాస్త ఆలస్యమైనా ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ను కట్ చేశారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే ‘దాక్కో దాక్కో మేక’ ‘శ్రీవల్లి’ ‘సామి సామీ’ ‘ఏయ్ బిడ్డా’ వంటి నాలుగు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'పుష్ప' పార్ట్-1 ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరిస్తోంది.

భూమండలంలో ఎక్కడా పెరగని చెట్లు శేషాచలం అడవుల్లో పెరుగుతున్నాయి.. అక్కడి నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది.. ఇది భూమిపై పెరిగే బంగారం.. ఎర్రచందనం అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టేసాడు.

బన్నీ గెటప్ - పాత్ర తీరుతెన్నులు - చిత్తూరు యాసలో మాట్లాడే విధానం ఆకట్టుకుంటున్నాయి. అయితే పోలీసులు జైళ్లో పెట్టి కట్టేసి చిత్రహింసలు పెట్టినా తన బాస్ ఎవరో చెప్పనని పుష్ప రాజ్ అనడం చూస్తుంటే.. అతను ఎవరి కిందో పని చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇదే క్రమంలో అతన్ని ఒక గ్యాంగ్ లీడర్ గా చూపించి ఆసక్తిని కలిగించారు.

అలానే పుష్పరాజ్ లోని లవ్ యాంగిల్ ని కూడా ట్రైలర్ లో చూడొచ్చు. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లిగా రష్మిక మందన్నా సందడి చేసింది. 'రంగస్థలం' లో రామలక్ష్మి పాత్రను గుర్తు చేసింది. పుష్ప - శ్రీవల్లి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అలరిస్తున్నాయి. సునీల్ - అనసూయ భరద్వాజ్ - అజయ్ ఘోష్ - ధనుంజయ లతో పాటుగా రావు రమేష్ - అజయ్ - శత్రు ఇందులో భాగమయ్యారు. ఇక ట్రైలర్ చివర్లో 'పార్టీ లేదా పుష్పా' అంటూ ఫహాద్ ఫాజిల్ తళుక్కున మెరిసారు.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ సన్నివేశాలు.. ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానం అందరిని ఆకర్షిస్తున్నాయి. 'ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవరి యుద్ధం వాళ్లదే..' 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ బన్నీ చెప్పే డైలాగ్స్ అలరిస్తున్నాయి. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కు ఆయువుపట్టుగా నిలిచాయి.

ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మాతలు. కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేయగా.. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు కోరుకునే పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ''పుష్ప'' రెడీ అయిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇది బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ. ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'పుష్ప: ది రైజ్' ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


Tags:    

Similar News