ఫిబ్రవరిలో సెట్స్ మీదకు 'పుష్ప' పార్ట్-2.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్..!

Update: 2021-12-11 04:31 GMT
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''పుష్ప: ది రైజ్''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో డిసెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా విశేషాలు వెల్లడించడానికి నిర్మాతలు నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - సీఈఓ చెర్రీ మీడియాతో మాట్లాడారు.

‘పుష్ప’ సినిమాను వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో కలిపి మూడు వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.. కానీ సినిమా అంతా అదే ఉండదు.

హ్యూమన్ వాల్యూస్ - ఎమోషన్స్ కలబోసి చక్కని అనుభూతి పంచేలా సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. తప్పకుండా మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. పాన్ ఇండియా సినిమా తీయాలనే మా కల ఈ 'పుష్ప' తో నెర వేరింది అని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అన్నారు.

''సుకుమార్ స్టోరీ చెప్పినప్పుడే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కథ అనిపించింది. అందుకే ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. 2 గంటల 59 నిమిషాల నిడివితో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఉత్కంఠగా సాగుతుంది. ప్రతీ భాషలోనూ చిత్తూరు బ్యాక్ డ్రాప్ నే చూపించాం. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అద్భుతంగా చేశారు.

ఏడాది మొత్తం అదే పాత్రలోనే ఉండిపోయారు. 'రంగస్థలం' లో రామ్ చరణ్ ఎలాగో.. ఇందులో బన్నీ అలాగ. బన్నీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి'' అని నిర్మాతలు తెలిపారు.

''సినిమాలో ప్రతి పాత్ర రియలిస్టిక్ గా నేచురల్ గా ఉంటుంది. మాస్ కథకు క్లాస్ హంగులను కలిపి అన్ని వర్గాల్ని అలరించేలా సుకుమార్ ఈ సినిమాను తీశారు. స్ర్కీన్ ప్లే రేసీగా ఉంటుంది.

దేవిశ్రీ ప్రసాద్ మా సంస్థలో ఎప్పుడూ మంచి సంగీతం అందిస్తారు. 'పుష్ప' కు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రెండింగ్ లో ఉన్నాయి. సమంత పాట మరో స్థాయిలో ఉంటుంది"

''మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఎన్నో సవాళ్ల మధ్య సినిమా షూటింగ్ చేశాం. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పటివరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టూరిజం కోసం ఆ లొకేషన్స్ లో తీసిన వీడియోలు అడిగారు.

టీమ్ అంతా చాలా కష్టపడి చేశారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ షూటింగ్ ను ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం'' అని మైత్రీ నిర్మాతలు వెల్లడించారు.

ఈ సందర్భంగా తమ బ్యానర్ లో రూపొందుతున్న మిగతా సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట'.. నానితో 'అంటే సుందరానికీ' సినిమాలు చేస్తున్నాం.

చిరంజీవి సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. బాలకృష్ణతో చేయబోయే చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వస్తుంది. ఇదే క్రమంలో కల్యాణ్ రామ్ తో ఓ సినిమా ఉంటుంది అని నవీన్ ఎర్నేని - రవిశంకర్ తెలిపారు.
Tags:    

Similar News