ఆఫరే లేదు..అలా ఎలా రాస్తారు?: పృథ్వి

Update: 2019-06-18 16:31 GMT
టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ లో 30 ఇయర్స్ పృథ్వి ఒకరు.  డైలాగ్స్ చెప్పడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన  శైలిని చూపించే ఆయన ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించడంలో స్పెషలిస్ట్.  అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ప్రకటించి.. వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.  ఎలెక్షన్స్ ఎపిసోడ్ పూర్తయింది.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.  దీంతో పృథ్వి మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు.  అయితే రీసెంట్ గా పృథ్వీ గురించి ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న  #AA19 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో ఒక పాత్రకు మొదట పృథ్విని తీసుకున్నారని.. అయితే ఎన్నికల ప్రచారంలో మెగా ఫ్యామిలీ సభ్యులయిన పవన్ కళ్యాణ్ తదితరులపై ఘాటుగా విమర్శలు చేయడంతో మెగా ఫ్యామిలీ గుర్రుగా ఉందట.  ఎలెక్షన్ పూర్తయిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవిపై పృథ్వీ కామెంట్లు చేయడంతో మెగా ఫ్యామిలీ సీరియస్ అయిందని.. ఇకపై మెగా హీరోల సినిమాల్లో పృథ్వీని తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.  అందుకే #AA19 నుండి పృథ్వీని తప్పించి మరో కమెడియన్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ ప్రచారంపై స్పందించిన పృథ్వీ అల్లు అర్జున్ సినిమాలో తనకు ఆఫర్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు.  'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ గారిని కలవలేదని.. ఆయన ఈ సినిమాలో వేషం ఇస్తారని  ఏమీ చెప్పలేదని అన్నాడు. అసలు తనకు ఆఫరే ఇవ్వకుండా సినిమానుండి ఎవారైనా ఎలా తొలగించగలరని ప్రశ్నించాడు.  వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని మీడియాను కోరాడు.  అంతే కాకుండా మెగా ఫ్యామిలీ అంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశాడు.  రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. వాటిని సినిమా రంగానికి ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. 


Tags:    

Similar News