షూటింగుల ఆర్డ‌ర్ గిల్డ్ నిర్మాత‌లు నిర్ణ‌యిస్తారా?

Update: 2020-06-11 03:45 GMT
మ‌హమ్మారీ ప్ర‌భావం చిన్న నిర్మాత‌ల కంటే యాక్టివ్ గిల్డ్ నిర్మాత‌ల‌పైనే ఎక్కువ‌. సినిమాలు తీయ‌ని వాళ్లు మిగిలారు. తీసేవాళ్లు న‌ష్ట‌పోయారు. అయితే సాధ్య‌మైనంత వ‌ర‌కూ డ్యామేజీని త‌గ్గించ‌డ‌మెలా?  దీనిపైనే సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు గిల్డ్ నిర్మాత‌లు. త్వ‌ర‌లో షూటింగులు ప్రారంభించ‌డ‌మెలా?  థియేట‌ర్ల‌ను తెరిపించ‌డ‌మెలా? అన్న సీరియ‌స్ చ‌ర్చ‌కు ఓ వేదిక‌ను సిద్ధం చేస్తున్నారు.

ఈ నెల నుంచి తెలుగు సినిమాల చిత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం స‌హా ఏపీ ప్ర‌భుత్వం అనుమతులు ఇచ్చేశాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో భాగమైన టాలీవుడ్ క్రియాశీల నిర్మాతలందరూ రేపు సమావేశమై త్వరలో షూటింగ్ ప్రారంభించాల్సిన చిత్రాల గురించి చర్చించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న చిత్రాలకు  ప్రొడ్యూసర్స్ గిల్డ్  తొలిగా అనుమతులు కేటాయిస్తుంది. తదుపరి బంచ్ సినిమాలు జూలై నుండి సెట్స్ కెళ‌తాయి. మరికొన్ని ఆగస్టు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశంలో విడుదల తేదీలపైనా.. థియేటర్లను తిరిగి తెరవడం గురించి మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేయాల్సిన మార్గదర్శకాల గురించి కూడా గిల్డ్ భేటీలో చర్చించనున్నారు. ఇప్ప‌టికే 20-30 శాతం షూటింగులు మాత్ర‌మే పెండింగ్ ఉన్న‌వి అర‌డ‌జ‌ను పైగా చిత్రాలు ఉన్నాయి. వీట‌న్నిటికీ తొలిగా అనుమ‌తులు మంజూరు చేస్తారు. అలాగే 40-50 శాతం ఉన్న‌వి సెట్స్ కెళ్లే వీలుంద‌ని అంచ‌నా. మొత్తానికి గిల్డ్ స‌మావేశంతో నిర్మాత‌ల మండ‌లి నామ మాత్ర‌మేనని భావించాల్సి ఉంటుందేమో!
Tags:    

Similar News