దళపతి ఆస్తి 2000 కోట్లు.. విడాకుల నేపథ్యంలో బిగ్ డిబేట్
విజయ్‌కి కార్లంటే అమితమైన ఇష్టం. ఆయన గ్యారేజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖరీదైన కార్లు కొలువుదీరి ఉన్నాయి.;
దళపతి విజయ్.. ఈ పేరు వింటేనే దక్షిణాది బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. తాజాగా తన రాజకీయ అరంగేట్రం, వ్యక్తిగత జీవితంపై సాగుతున్న చర్చల నడుమ, విజయ్ ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ కేవలం నటుడిగానే కాకుండా అత్యంత సంపన్న స్టార్‌గా కూడా ఎదిగారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు 100 నుండి 150 కోట్ల పారితోషికం(అదనంగా లాభాల్లో వాటా) అందుకుంటూ, సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరిగా రికార్డు సృష్టించారు.
విజయ్ సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 1984లో తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన `వెట్రి` చిత్రంతో కేవలం 10 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. అలా బాలనటుడిగా ఏడు చిత్రాల్లో నటించిన విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి `నాన్ సిగప్పు మనితన్`లో సందడి చేశారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో `నాలయ్య తీర్పు` సినిమాతో హీరోగా మారారు. తొలినాళ్లలో ఒడిదుడుకులు ఎదురైనా, విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన `పూవే ఉనక్కగా` సినిమా విజయ్‌ని స్టార్‌గా మార్చేసింది. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్‌గా ఎదిగారు.
కేవలం తమిళనాడులోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాలు.. కేరళలో విజయ్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. మలయాళ స్టార్ హీరోలకు ధీటుగా కేరళలో మార్కెట్ ఉన్న ఏకైక పరభాషా నటుడు విజయ్ మాత్రమే. ఆయన నటించిన `తేరి` వంటి చిత్రాలు అక్కడ మలయాళ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లను సాధించడం విశేషం. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా విజయ్ భారీగా ఆర్జిస్తున్నారు. ఏడాదికి కేవలం ప్రకటనల రూపంలోనే ఆయనకు 10 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. బహుళ అంతర్జాతీయ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ విలాసవంతమైన జీవనశైలికి ఆయన నివాసమే ఒక నిదర్శనం. చెన్నైలోని నీలంకరై సముద్రతీరంలో ఉన్న ఆయన బంగ్లా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ బీచ్ హౌస్‌ను పోలి ఉంటుంది. అమెరికా పర్యటనలో టామ్ క్రూజ్ ఇంటిని చూసి ముగ్ధుడైన విజయ్, దాదాపు అలాంటి నిర్మాణంతోనే తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. అయితే ఈ స్థాయి సంపద ఉన్న తరుణంలోనే 2020లో ఐటీ దాడులు ఎదురవ్వడం సంచలనం సృష్టించింది. కానీ సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు లేవని అధికారులు నిర్ధారించారు.
విజయ్‌కి కార్లంటే అమితమైన ఇష్టం. ఆయన గ్యారేజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖరీదైన కార్లు కొలువుదీరి ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న 'రోల్స్ రాయిస్ ఘోస్ట్' కారు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. గతంలో ఈ కారు ఎంట్రీ టాక్స్ విషయంలో చిన్న వివాదం తలెత్తినప్పటికీ, విజయ్ తన అభిరుచిని ఎప్పుడూ తగ్గించుకోలేదు. ఆయన వద్ద బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, ఎక్స్6, ఆడి ఎ8 ఎల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్, ఫోర్డ్ ముస్తాంగ్ వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి.
మొత్తానికి లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ తండ్రి ప్రోత్సాహంతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ్ నేడు 2000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. భారీ విజయాలతో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనం. ఇటీవల టీవికే (తమిళగ వెట్రి కజగం) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లోకి వెళుతూ చిట్టచివరి సినిమా `జననాయగన్` రిలీజ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలనే పట్టుదలతో రాజకీయ తుఫాన్ గా మారుతున్న క్రమంలో, భార్య సంగీత బిగ్ బాంబ్ పేల్చారు. విజయ్ కి ప్రముఖ కథానాయికతో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా, అతడు మారని కారణంగా విడాకులు కావాలి అంటూ కోర్టుకు దరఖాస్తు చేసుకోవడం సంచలనమైంది. ఈ ఫ్యామిలీ వివాదం కారణంగా ఇప్పుడు ఆయన సంపదల గురించి మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది.