స్టన్నింగ్ స్టంట్: 64 వయసులో యాక్షన్ కింగ్ రోల్ మోడ‌ల్ ఇందుకే

అర్జున్ తన అద్భుతమైన ఆరోగ్యం, ఫిట్‌నెస్ వెనుక కఠినమైన మార్షల్ ఆర్ట్స్ సాధన ఉందని పలుమార్లు వెల్లడించారు.

Update: 2026-09-24 04:57 GMT

భారతీయ సినీపరిశ్రమలో 'యాక్షన్ కింగ్' గా దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా.. వయసు పెరుగుతున్న కొద్దీ తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా 64 ఏళ్ల వయసులోనూ అలవోకగా గాల్లోకి కాలు ఎత్తి.. బాటిల్ మూతను చాలా ఈజీగా ఎగరగొట్టిన కరాటే స్టంట్ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వయసులోనూ ఈ అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ చూసి యూత్ , ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అసలు ఈ వయసులోనూ అర్జున్ ఇంత ఫిట్‌గా ఉంచుతున్న ఆ రహస్యం ఏంటనే దానిపై సర్వత్రా ఆరాలు మొద‌ల‌య్యాయి.

అర్జున్ తన అద్భుతమైన ఆరోగ్యం, ఫిట్‌నెస్ వెనుక కఠినమైన మార్షల్ ఆర్ట్స్ సాధన ఉందని పలుమార్లు వెల్లడించారు. ఆయనకు చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న మమకారంతో పాటు, నేటికీ రోజువారీ జీవితంలో కరాటే -కిక్ బాక్సింగ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు. కేవలం వ్యాయామమే కాకుండా సమతుల్యమైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం వల్లనే తన శరీర దారుఢ్యాన్ని నేటికీ కాపాడుకోగలుగుతున్నారు. ప్రతిరోజూ గంటల తరబడి శారీరక శ్రమ చేయడం, యోగా - స్ట్రెచ్‌వర్క్ చేయడం ఆయన దినచర్యలో భాగం.

ఇక అర్జున్ స‌ర్జా సినీ ప్రయాణం విషయానికి వస్తే.. తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం 'మా పల్లెలో గోపాలుడు' (1985). ఆ తర్వాత వరుసగా ప‌లు తెలుగు - తమిళ చిత్రాల్లో నటించి సౌత్ ఇండియాలో తిరుగులేని యాక్షన్ హీరోగా ఎదిగారు. అత‌డు నటించిన ఎన్నో చిత్రాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కెరీర్‌లో జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు (ముధల్వన్), హనుమాన్ జంక్షన్, ప్రసాద్, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయాలను సాధించి భారీ స్టార్‌డమ్‌కి చేర్చాయి.

ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 160కి పైగా సినిమాలలో ప్రధాన పాత్రల్లో నటించి అగ్రనటుడిగా నిలిచారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్న అర్జున్, 'సేవగన్' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జై హింద్, కర్ణ, ఎజుమలై, పరశురామ్, జై హింద్ 2 వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన దర్శకుడిగా- నిర్మాతగా తన కుటుంబం నుంచి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను నటిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ఆమె కెరీర్‌ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెరపై తనదైన యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కఠినమైన ఫిట్‌నెస్ నియమాలను పాటిస్తూ అర్జున్ నేటి తరానికి నిజమైన రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు.



Tags:    

Similar News