దురంధర్ 2: భార్య సమీక్షలు సరే కానీ ప్రేక్షకులేం తేలుస్తారో!
దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. ఆయనకు తన ప్రేక్షకులన్నా.. దేశమన్నా అమితమైన ప్రేమ అని యామి కొనియాడారు.;
భారతీయ సినీపరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో `దురంధర్ 2` (దురంధర్: ది రివెంజ్) ఒకటి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను తాజాగా ఆయన భార్య, నటి యామి గౌతమ్ వీక్షించారు. సినిమా చూసిన తర్వాత విపరీతమైన ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం కేవలం అద్భుతం మాత్రమే కాదు... బియాండ్ ఎక్స్‌ట్రార్డినరీ (సాధారణ స్థాయికి మించి) అంటూ ప్రశంసించారు. అయితే భార్యగా తన భర్త ప్రతిభను పొగడటం సహజమే కానీ.. థియేటర్లలో ప్రేక్షకులు కదా దీనిని డిసైడ్ చేయాలి! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దురంధర్ 2 ని పెద్దతెరపై చూసిన తర్వాత తాను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని యామి తెలిపారు. స్క్రీనింగ్ ముగిసిన వెంటనే తాను ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చిందని.. కానీ ఆ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ప్రభావం నుండి బయటకు రాలేక ఆదిత్యతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితికి చేరుకున్నానని యామి తెలిపారు. ప్రయాణంలో మరో స్క్రిప్ట్ చదవాలని ప్రయత్నించినా.. మనసంతా `దురంధర్ 2` దృశ్యాల చుట్టూనే తిరగడంతో దేనిపైనా దృష్టి పెట్టలేకపోయానని అన్నారు. ఆదిత్య కేవలం 40 పేజీల స్క్రిప్ట్ వినిపించినప్పుడే తన కళ్లు చెమర్చాయని.. ఇప్పుడు తెరపై చూశాక అది ఒక మర్చిపోలేని అనుభవంగా మారిందని యామి తనదైన శైలిలో విశ్లేషించారు.
దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. ఆయనకు తన ప్రేక్షకులన్నా.. దేశమన్నా అమితమైన ప్రేమ అని యామి కొనియాడారు. వారి కోసమే తన ప్రాణాన్ని పణంగా పెట్టి (ప్రమాదకర స్థాలలో షూటింగ్ చేసారు కదా) ఎంతో నిజాయితీతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని ప్రశంసించారు. తొలి భాగం `దురంధర్` ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు వసూలు చేసి చరిత్రను తిరగరాసింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణవీర్ సింగ్ గూఢచారిగా తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారని, అలాగే సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటుల కలయిక సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని సమాచారం. ఈ సీక్వెల్‌లో యామి గౌతమ్ కూడా ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్జీవీ ప్రశంసలు.. బాలీవుడ్ మీడియా బూస్టింగు:
మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు. `దురంధర్ 2` ఒక ఆస్టరాయిడ్ స్ట్రైక్ (గ్రహశకల దాడి) లాంటిదని.. ఇది పాతకాలపు మసాలా సినిమాల ధోరణిని పూర్తిగా మార్చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓవైపు భార్య ప్రశంసలు.. మరోవైపు దిగ్గజ దర్శకుల విశ్లేషణలతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. కొన్ని బాలీవుడ్ మీడియాలు తమ సమీక్షలతో బిగ్ బూస్ట్ ఇస్తున్నాయి.
అయితే భార్య తన భర్తను పొగిడేయడం, సొంత మీడియాలు ఊదరగొట్టేయడం ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అందుకే నిజమైన థియేటర్ ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏమంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 19 మార్చి 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదే సమయంలో కన్నడ స్టార్ యాష్ నటిస్తున్న `టాక్సిక్` సినిమా కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఎదురవుతోంది. ఇది ఓపెనింగ్ లను కిల్ చేస్తుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. టాక్సిక్ కారణంగా దురంధర్ 2 చిత్రం 100 కోట్ల ఓపెనింగులు సాధించడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ఆదిత్యాధర్ భార్యగా యామి గౌతమ్ ఇచ్చిన రివ్యూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినా కానీ... అసలు సిసలైన రిజల్ట్ మార్చి 19న సామాన్య ప్రేక్షకులు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. మరి `దురంధర్ 2` బాక్సాఫీస్ వద్ద మళ్ళీ చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి!